పావులు కదుపుతున్న బిజెపి: ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ

By telugu teamFirst Published Jan 19, 2020, 9:28 AM IST
Highlights

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకున్న తర్వాత సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం విశేషం.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్న బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బిజెపి నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమావేశమయ్యారు. 

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తున్న విషయంం తెలిసిందే. కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు, ముద్రగడ పద్మనాభం మధ్య జరిగిన భేటీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

Also Read: కంగారు పడుతున్నట్లున్నారు, అది ప్రభుత్వం తప్పుకాదండీ: జగన్ కు ముద్రగడ లేఖ

తాజా రాజకీయ పరిణామాల గురించి సోము వీర్రాజు, ముద్రగడ పద్మనాభం మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జనసేనతో పొత్తుపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. కాపు సామాజిక వర్గంలో పట్టు ఉన్న ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకుంటే బలం పెంచుకోవచ్చునని బిజెపి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే, కాపు రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనేది అనుమానమే.

Also Read: బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యూహం: ముద్రగడతో ఆర్ఎస్ఎస్ నేత భేటీ

యాబై శాతం కోటాను మించి రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని బిజెపి జాతీయ నాయకులు గతంలోనే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు కట్టుబడి ఉన్నట్లుగానే కనిపిస్తోంది. కాపులను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. అగ్రవర్ణాలకు కల్పించిన కోటాలో కాపులకు ప్రాధాన్యం ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. 

కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయం తన పరిధిలో లేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. అయితే, కాపులకు ప్రత్యేక వరాలను ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం బిజెపి వైపు అడుగులు వేస్తారా అనేది వేచి చూడాల్సిందే.

Also Read: బాబు పంపిన కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి: మోడీకి ముద్రగడ లేఖ

click me!