తెలుగు దేశం పార్టీలో తనకు విలువ ఇవ్వకపోవడం వల్లే కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని బీజేపీ నేత పురిఘళ్ల రఘురామ్ పేర్కొన్నారు. కోడెల మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన... నెల రోజుల క్రితం కోడెల తనకు ఫోన్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. నెల రోజుల క్రితం తనకు ఫోన్ చేసి కోడెల తన బాధను పంచుకున్నారని రఘురామ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి అధికార వైసీపీ నేతలే కారణమంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ పెట్టిన ఒత్తిళ్ల కారణంగానే ఆయన మృతి చెందినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా... టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు కూడా తిప్పి కొడుతున్నారు. ఈ క్రమంలో ఓ బీజేపీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
తెలుగు దేశం పార్టీలో తనకు విలువ ఇవ్వకపోవడం వల్లే కోడెల తీవ్ర మనోవేదనకు గురయ్యారని బీజేపీ నేత పురిఘళ్ల రఘురామ్ పేర్కొన్నారు. కోడెల మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన... నెల రోజుల క్రితం కోడెల తనకు ఫోన్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. నెల రోజుల క్రితం తనకు ఫోన్ చేసి కోడెల తన బాధను పంచుకున్నారని రఘురామ్ పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తనతో మాట్లాడిన సందర్భంగా మాజీ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, నిజాయితీతో పనిచేసే నాయకులకు టీడీపీలో విలువలేదని చెప్పారని బీజేపీ నేత తెలిపారు. పార్టీలో తనను పూర్తిగా ఒంటరిని చేయడం మానసిక క్షోభను కలిగిస్తోందని ఆయన చెప్పారన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీలో చేరుతానని కోడెల అంటూ.. అమిత్ షాను కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారని రఘురామ్ వివరించారు. అయితే అమిత్ షాను కలువకుండానే కోడెల మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మాజీ స్పీకర్ మృతిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు చేయించాలని పురిఘళ్ల డిమాండ్ చేశారు.