
నంద్యాల ఉపఎన్నికలో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఉత్సాహం చూపుతోంది. వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి ఐదు రోజుల క్రితం హటాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే కదా? ఖాళీ అయిన స్ధానంలో పోటీ చేసేందుకు ఒకవైపు వైసీపీ, టిడిపిలు సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపేమో సదరు స్ధానం తమదే కాబట్టి ఏకగ్రీవంగా తమకే వదిలిపెట్టాలని ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు చంద్రబాబునాయు ఇద్దరు విజ్ఞప్తులు చేస్తున్నారు. వీరిద్దరి వరసా చూస్తుంటే నంద్యాలలో పోటీ తప్పదని తేలిపోయింది. ఎందుకుంటే, నంద్యాలలో గెలవటమన్నది ఇపుడు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.
ఈ పరిస్ధితుల్లో భూమా మరణించి వారం కూడా కాకుండానే పోటీలో ఎవరిని దింపాలనే విషయంలో అపుడే చంద్రబాబు అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న భాజపా నేతలు కూడా స్పందిస్తున్నారు. ఇపుడు జరుగుతున్న ఎంఎల్సీ ఎన్నికలోనే పోటీ చేయాలని అనుకున్నా సాధ్యం కాలేదని అంటున్నారు. కాబట్టి ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం మాత్రం తమకే ఇవ్వాలంటూ చంద్రబాబునాయుడును కలవాలని నిర్ణయించుకున్నారు.
పార్టీ తరపున పోటీ చేయటానికి డాక్టర్ ఆదినారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి చంద్రబాబు కమలనాధుల డిమాండ్ ను మన్నిస్తారా లేదా అన్నది తొందర్లోనే తేలిపోతుంది లేండి. భాజపా పోటీ చేసే విషయం నియోజకవర్గంలో గెలుపోటములపై చంద్రబాబు చేయించుకునే సర్వే ఫలితాలపై ఆధారపడి ఉంటుందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.