టీడీపీ నేత బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపేయాలని అనుకున్నారని బీజేపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. అరెస్ట్ చేసిన తర్వాత నగర శివార్లలో పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారని అన్నారు.
టీడీపీ నేత బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపేయాలని అనుకున్నారని బీజేపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. అరెస్ట్ చేసిన తర్వాత నగర శివార్లలో పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారని అన్నారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్న బీటెక్ రవితో సీఎం రమేష్ ఈరోజు ములాఖత్ అయ్యారు. అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీటెక్ రవిని ఈ నెల 14న కడప నగర శివార్లలో వాహనంలో నుంచి దింపి పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు. ఆ తర్వాత పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారు. బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది అని హెచ్చరించారు’’ అని ఆరోపించారు.
రూల్స్ ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అలా చెప్పకుండా బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపేయాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. అయితే వారి ప్లాన్ ఫెయిల్ అయిందని.. మీడియా వల్ల బీటెక్ రవి బతికి బయటపడ్డాడని చెప్పుకొచ్చారు. మీడియాలో వార్తలు రావడంతో పాత కేసులో అరెస్ట్ చేసినట్టు చూపారని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏపీలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మాదిరిగా మారిపోయారని ఆరోపించారు. సీఎం జగన్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ అరెస్ట్ చేయిస్తున్నారని విమర్శించారు.
‘‘ప్రజాస్వామ్యంలో పోరాడాలని.. మంచి చేస్తే ప్రజలకు చెప్పుకోవాలని, అంతేగానీ ఈ విధంగా అరాచకాలు సృష్టించడం సరికాదు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. పోలీసులు హద్దులు మీరి పని చేస్తున్నారు. రోజులు దగ్గర పడ్డాయి.. విచారణ చేస్తే ఉద్యోగాలు పోతాయి.. ఒకరి కోసం ఉద్యోగాలు పొగొట్టుకుని బలి కావొద్దు. పోలీసులు చిన్న చిన్న లాభాల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పోగోట్టుకోకండి’’ అని సీఎం రమేష్ అన్నారు.