మంత్రులపై దాడి.. వాస్తవాలు బయటకు రావాల్సిందే , లేదంటే ప్రభుత్వ వైఫల్యమే : బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

By Siva KodatiFirst Published Oct 15, 2022, 9:46 PM IST
Highlights

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడి ఘటనపై స్పందించారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. నిజంగా దాడి జరిగి ఉంటే అది ప్రభుత్వం, పోలీసులు వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులు రోజా, జోగి రమేష్ , టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడిపై స్పందించారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రుల కార్లపై జనసేన దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించలేదన్నారు. కేవలం వైసిపి నాయకులు మాత్రమే ప్రకటనలు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి మంచిది కాదు.. తాము దానికి వ్యతిరేకమన్నారు. పవన్ కళ్యాణ్ వస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది

సంఘటనలు జరగకుండా ఆపాల్సింది ఎవరు... రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని చెబుతారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాలి, నిజాలు రావాలని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాడి ఎవరు చేసినా సరైన విధానం కాదని... నిజంగా దాడి జరిగి ఉంటే అది ప్రభుత్వం, పోలీసులు వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు.

ALso Read:లీడర్‌ను బట్టే కేడర్ ... వాళ్లు జనసైనికులు కాదు, జనసైకోలు : విశాఖ దాడి ఘటనపై గుడివాడ ఆగ్రహం

మరోవైపు... విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడి ఘటనపై నగర పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగిందంటే:

వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్ ఇతర వైసీపీ నేతలు విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వాహనాలపై కర్రలు, రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. తమ నేతలపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జనసేన శ్రేణులను పవన్ కల్యాణ్ అదుపులో పెట్టుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. 
 

click me!