ఏపీలో బర్డ్‌ ఫ్లూ కలకలం.. చికెన్ అమ్మకాల నిలిపివేత..

By Rajesh Karampoori  |  First Published Feb 17, 2024, 5:45 AM IST

Bird flu; ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపింది. ఇటీవల నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి.


Bird flu;  ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపింది. ఇటీవల నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వాటి శాంపిల్స్ ను భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి పంపగా.. అవి చనిపోవడానికి కారణం ఎవిఎఎన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని నిర్ధారణ అయింది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ అప్రమత్తం చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్‌ సిఇఒ ఆ రెండు గ్రామాల్లో ఎంపిడిఒ, పిఒపిఆర్‌డి, వెటర్నరీ డాక్టర్‌, రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో కలసి గ్రామసభలు నిర్వహించారు. జిల్లాలోని ప్రజలకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్‌ షాపు యజమానులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాతో పాటు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. 

బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో బర్డ్ ఫ్లూ నివారణపై జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎం.హరి నారాయణన్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు  అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు  పది కిలోమీటర్ల పరిధిలో 3 రోజులపాటు చికెన్ షాపులు మూసివేయాలని ఒక కిలోమీటర్ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదని ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి సోకిన ప్రాంతం నుండి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకూడదని, వేరే ప్రాంతం నుండి కోళ్లను తీసుకురాకూడదని కలెక్టర్ సూచించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలని, కోళ్ల ఫాంలు, ఆ కోళ్ల వద్ద పనిచేసే మనుషులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.

Latest Videos

click me!