AP Fibernet Scam: చంద్ర బాబు మెడకు మరో ఉచ్చు

By Rajesh KarampooriFirst Published Feb 17, 2024, 1:08 AM IST
Highlights

AP Fibernet Scam : ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ శుక్రవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జ్‌షీట్‌‌లో ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావును పేర్కొన్నారు. 

AP Fibernet Scam : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ శుక్రవారం (ఫిబ్రవరి 16) చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.స్కామ్‌లో నిందితులుగా ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావును పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు సీఐడీ పేర్కొంది. మొత్తం రూ. 2000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ. 330 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చింది.
 
ఫైబర్‌‌నెట్‌ ప్రాజెక్టులో భాగంగా టీడీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి, టెండర్‌లో అవకతవకలకు పాల్పడిందనీ, రూ. 330 కోట్ల రూపాయల ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1 వర్క్ ఆర్డర్‌ను లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన ‘టెరా సాఫ్ట్‌’ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారనేది  సీఐడీ ప్రధాన అభియోగం. అలాగే.. వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు నేర నేపథ్యం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గవర్నింగ్ కౌన్సిల్-గవర్నెన్స్ అథారిటీ సభ్యునిగా నియమించబడ్డారు. వస్తువుల ధరలు లేదా అనుసరించాల్సిన ప్రమాణాలకు సంబంధించి మార్కెట్ సర్వే చేయలేదన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టు అంచనాలకు ఆమోదం తెలిపిందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకవచ్చినట్టు సీబీఐ తెలిపింది.  టెక్నికల్ కమిటీ, టెండర్ మూల్యాంకన కమిటీ సభ్యుడిగా వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను నియమించి టెండర్ ప్రక్రియలో సాంబశివరావు అవకతవకలకు పాల్పడ్డారని సీఐడీ వాదించింది.

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి, రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు ఉంచారు. చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాగా.. తాజాగా మరో కేసులో చంద్రబాబుని ఏ1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయంగా మారింది. 

click me!