
చంద్రబాబునాయడుకు కూడా విభజన గాయాలా? సమైక్య రాష్ట్ర విభజనతో చంద్రబాబు కూడా నష్టపోయారట. నిజంగా నిజమేనా? తన భార్య హైదరాబాద్ లో ఉంటే తాను విజయవాడలో ఉంటున్నట్లు తెగ బాధపడితున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయడుతో కలిసి చంద్రబాబు వెలగపూడిలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాటా మంతి కలిపారు. అపుడు ఉద్యోగులు తమ ఇబ్బందులను వెంకయ్యతో చెప్పుకున్నారట.
తమ భార్యా, పిల్లలు, హైదరాబాద్ లో ఉంటే తాము మాత్రం విజయవాడలో పనిచేయాల్సి వస్తోందని వాపోయారట. దాంతో అక్కడే ఉన్న చంద్రబాబు కల్పించుకుంటూ ‘ అవును..రాష్ట్ర విభజన గాయాలు నాకూ తగిలాయి. నేనూ బాధితుడినే. నా భార్య హైదరాబాద్ లో.. నేను ఇక్కడ ఉంటున్నాం ’ అని నవ్వుతూ అన్నారట.
కుటుంబానికి దూరంగా చంద్రబాబు విజయవాడలో ఉండటము..ఉద్యోగులు విజయవాడలో ఉండటమూ ఒకటేనా? చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలవాలంటే అర్ధగంటలో హైదరాబాద్ లో ఉండగలరు. మరి ఉద్యోగులకు సాధ్యమా? సిఎం హోదాలో చంద్రబాబు ఎక్కడ కూర్చున్నా సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
మరి ఉద్యోగుల పరిస్ధితో? ఏదో కక్షగట్టినట్లుగా హైదరాబాద్ లో పనిచేసుకుంటున్న ఉద్యోగులందరినీ వెలగపూడికి తరలించారు గానీ తాత్కాలిక సచవాలయంలో ఇప్పటికీ పూర్తిస్ధాయి సౌకర్యాలు లేక వేలాది మంది ఉద్యోగులు అవస్తులు పడుతున్నారు. ఈ విషయాలు సిఎంకు తెలియనివీ కావు. అయినా చంద్రబాబుకు అదో ఆనదం.
ఇక, కుమారుడు లోకేష్ వరస చూస్తే ఇంకోలా ఉంది. లోకేష్ కు ఎప్పుడూ తన కొడుకు తాతతో ఆడుకోవాలని ఉండదా అని ప్రశ్నిస్తుంటారు. నెలకోసారి తన తండ్రి ఇంటికి వస్తుంటే తన కొడుకు కొత్త వారిని చూసినట్లు చూస్తున్నాడని, ఈ విషయం తమనెంతో బాధిస్తోందని చెప్పుకుని తిరుగుతుంటారు. ఎంతకాలమని తండ్రి, కొడుకులు సెంటిమెంట్ ను పండిస్తున్నామనుకుటున్నారో అర్ధం కావటం లేదు.
ఈ విషయాలన్నింటినీ చూస్తున్న ఉద్యోగులు మరోలా స్పందిస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న కుటుంబంతో కలిసి గడపలేకపోతున్న చంద్రబాబును అసలు ఎవరు విజయవాడకు పరుగులు పెట్టమన్నారని అనికుంటున్నారు. కోట్లాది రూపాయలు వ్యయం చేసి తయారుచేసుకున్న సచివాలయాన్ని కాదనుకుని హైదరాబాద్ నుండి ఎందుకు చంద్రబాబు విజయవాడకు పరిగెత్తాడని ప్రశ్నిస్తున్నారు.
ఓటుకునోటు కేసులో తగులుకోవటం వల్లే సమస్యా అంతా వచ్చిందని, దాన్నించి తప్పించుకోవటానికే చంద్రబాబు విజయవాడకు పరుగులు పెట్టారన్న సంగతి ఎవరిని అడిగినా చెబుతారు. ఇదే విషయం వెంకయ్య కూడా తెలీనిదేమీ కాదు. ఏదో తమ వద్దకు వచ్చాడు కదా అని ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చంద్రబాబు కల్పించుకోకపోతే వచ్చే నష్టం కూడా ఏమీ లేదు.
అనవసరంగా ఏదో జోకు వేసాననుకున్న చంద్రబాబు మాట్లాడటంతో ఉద్యోగులకు మండింది. వెంకయ్య, చంద్రబాబులు తమ వద్ద నుండి వెళ్లిపోయిన తర్వాత ఉద్యోగులు మాట్లాడుకుంటూ, ’ అసలు రాష్ట్ర విభజన అన్నదే జరగకపోతే చంద్రబాబుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కి ఉండేది కాదేమో’నని నిట్టూర్చారట.