వీడిన ఉత్కంఠ.. తిరుపతి వైసీపీ అభ్యర్థి ఎవరనే దానిపై అధికారిక ప్రకటన..!

By Sumanth Kanukula  |  First Published Oct 4, 2023, 11:10 AM IST

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి అధికార వైసీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ  చేయనున్నారనే ఉత్కంఠకు తెరపడింది. 


తిరుపతి: రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి అధికార వైసీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ  చేయనున్నారనే ఉత్కంఠకు తెరపడింది. తిరుపతి అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి పోటీ చేస్తారని వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. వివరాలు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల కో ఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ఇటీవల తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. 

ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి భూమన అభినయ్‌రెడ్డి పోటీ చేయనున్నారని విజయ సాయిరెడ్డి ప్రకటించారు. అభినయ్‌రెడ్డి.. తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభినయ్ రెడ్డి.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు. ఇక, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించనప్పుడే.. ఇవే తన చివరి ఎన్నికలని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Latest Videos

ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి.. తన వారసుడు అభినయ్ రెడ్డిని బరిలో నిలపాలని చూస్తున్నారు. ఇక, రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా.. ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని వైసీపీ కొన్ని నెలల కిందట అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి తిరుపతి వైసీపీ టికెట్ విషయంలో కూడా భూమన అనుచరలు.. అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. తాజాగా తిరుపతి వైసీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి పేరు ఖరారు కావడంతో.. వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.  

click me!