
ఆమె ఓ బ్యాంకులో ఉద్యోగిణి. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ చిట్టీలు నిర్వహిస్తుంటారు. పెళ్లి అయిన కొన్ని నెలల నుంచే ఉద్యోగాల రీత్యా భార్యాభర్తలు వేరు వేరు చోట్ల ఉంటున్నారు. కొంత కాలం తరువాత లాక్ డౌన్ వచ్చింది. దీంతో భర్త చిట్టీల బిజినెస్ లో పూర్తిగా నష్టం వచ్చింది. దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పులను తీర్చేందుకు డబ్బు కోసం చాలా ప్రయత్నించారు. కానీ అవి సర్దుబాటు కాలేదు. దీనికి తోడు భార్యాభర్తలు చాలా కాలంగా ఒకే చోట ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ బదిలీ సాధ్యం కాకపోవడంతో నిరుత్సాహంలో ఉన్నారు. దీంతో ఇద్దరు పిల్లలను బంధువుల ఇంటికి పంపించేసి దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటన చిత్తూరు జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. అయితే ఇది ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. ఏపీలోని కడప జిల్లా వీరప్పనాయినిపల్లి మండలంలోని మైలుచెరువు గ్రామానికి చెందిన శివనాగభాస్కర్ రెడ్డి(30)కి, ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన గౌరికి కొన్నేళ్ల కిందట పెళ్లి జరిగింది. అయితే భార్య గౌరి చిత్తూరు జిల్లా నగరిలో ఉన్న యూనియన్ బ్యాంకులో నాలుగు సంవత్సరాల నుంచి క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త భాస్కర్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆయన చిట్టీల బిజినెస్ కూడా చేసేవారు.
ఈ దంపతులకు పెళ్లి అయిన 6 నెలల నుంచి వారి వారి ఉద్యోగాల వల్ల చెరో ప్రాంతంలో నివసిస్తున్నారు. చాలా కాలం నుంచి ఒకే చోటు కలిసి ఉండాలని చూస్తున్నారు. దీని కోసం ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో కొంత నిస్పృహలోకి చేరుకున్నారు. కరోనా లాక్ డౌన్ రావడం వల్ల భాస్కర్‌రెడ్డి చిట్టీల బిజినెస్ లో కూడా లాస్ వచ్చింది. దీంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు డబ్బులు అడ్జెస్ట్ కాలేదు.
డబ్బు కోసం బ్యాంకు లోన్ కోసం గౌరి ప్రయత్నించారు. తన పని చేసే నగరితో పాటు పలు ప్రాంతాల్లో కూడా లోన్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా లోన్ దొరకలేదు. తాను క్యాషియర్ గా పని చేస్తున్నాని, క్లర్కుగా పని చేసే వారికే రూ.40 లక్షల హోమ్ లోన్ దొరుకుతుందని, కానీ తనకు రూ.15 లక్షలు ఇచ్చినా సరిపోతుందని చెప్పినా లోన్ రాలేదని ఆమె ఆవేదన చెందారు. ఈ విషయాన్ని ఆమె సూసైడ్ నోట్ లో రాసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము సూసైడ్ చేసుకుంటున్నామని కూడా దాంట్లో రాశారు. వారి సంతానం వృత్తిక(4), కుసుమంత రెడ్డి(1)లను కొన్ని రోజుల క్రితం వారి బంధువుల ఇంటికి పంపించారు. అనంతరం ఆదివారం రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ నగరిలో ఉన్న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు దంపతులు ఒకే సారి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి సహాయం చేస్తారు.