
అనంతపురం : తెలుగుదేశం అధినేత Chandrababu naidu, ప్రధాన కార్యదర్శి Lokeshలపై anantapuram జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేశారు. ఈనెల 15న రాత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి హోదాలో Ushasri Charan తొలిసారి కళ్యాణదుర్గానికి రావడంతో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో 8 నెలల చిన్నారి అనారోగ్యంతో ఉండగా, వైద్యం కోసం వస్తూ సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లగా పోవడంతో మృతి చెందింది అని పేర్కొంటూ చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్లో ప్రభుత్వంపై ద్వేషభావం, పోలీసులు, ప్రజల మధ్య విభేదాలు కలిగించేలా పోస్ట్ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ipc 153-ఎ రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి డిఎస్పి మహబూబ్బాషా చెప్పారు.
కాగా, ఏప్రిల్ 16న మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటనలో చిన్నారి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కళ్యాణ దుర్గంలో పసిపాప మృతిపై టీడీపీ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోడానికి కారణం అయ్యారు. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణం.
అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే చిన్నారిని అడ్డుకోవాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెపుతారు? చావు డప్పులో పదవీ సంబరాలు జరుపుకున్న మంత్రి... ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారు? అంటూ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
ముమ్మాటికీ హత్యే.. నారా లోకేష్..
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన కోసం పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్, ఈశ్వరమ్మ దంపతుల ఏడాది చిన్నారి బలైంది. ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు చేసిన హత్యే. అనారోగ్యంతో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని ప్రాధేయపడినా, పోలీసులు వదలకపోవడంతోనే నడిరోడ్డుపైనే కన్నుమూసింది చిన్నారి. మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపేయడమే శిశు సంక్షేమమా మంత్రి గారు! చిన్నారి కొనప్రాణాలతో కొట్టుకుంటున్న కనికరించని పోలీసులపై చర్యలుతీసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు మరికొందరు నేతలు కూడా పత్రికా ప్రకటనలు, ట్వీట్లు.. విమర్శలతో విరుచుకుపడ్డారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వం మీద విద్వేషాన్ని రగిల్చేలా... వ్యతిరేకతను పెంచేలా చేస్తున్నారంటూ వైసీపీ మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.