సన్యాసం తీసుకుని.. శివరామానంద సరస్వతిగా మారిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే...

By AN TeluguFirst Published Apr 3, 2021, 2:44 PM IST
Highlights

ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన నేత ఏకంగా సన్యాసం స్వీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ శివరామకృష్ణ రావు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు.

ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన నేత ఏకంగా సన్యాసం స్వీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ శివరామకృష్ణ రావు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు.

ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. డాక్టర్ వడ్డెమాను శివరామకృష్ణ రావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇదే నియోజకవర్గంలోని అట్లూరు మండలం కమలకూరు స్వగ్రామం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడిగా ఈయన క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు.

1972 లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బిజివేముల వీరారెడ్డిపై ఓటమి చెందారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండో సారి గెలుపొందారు.

1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు.  శివరామకృష్ణ రావు తో పాటు అప్పట్లో పులివెందుల నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి, మైదుకూరు నుంచి డి.ఎల్.రవీంద్రారెడ్డి లు 1972లో తొలి సారి గెలుపొందారు. ముగ్గురు వైద్యులు కావడం, యువకులుగా అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.

నాటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్ లో మంత్రి పదవి అవకాశం వచ్చినా తన మిత్రుడైన వైయస్ రాజశేఖర్రెడ్డి కోసం త్యాగం చేసి వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు

అంతకుముందు శివరామకృష్ణ రావు తండ్రి వడ్డెమాను చిదానందం 1952లో తొలి జనరల్ ఎలక్షన్స్ లో బద్వేలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆయన 1962లో బద్వేలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరోమారు శాసన సభ్యునిగా ఎన్నిక కావడం గమనార్హం.

బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శివరామకృష్ణారావు ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో రాజకీయాల్లో జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేశారు. 

2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ గా మారడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండోసారి సీఎం గా ఎన్నికైన వైఎస్ఆర్ ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని భావించిన ఆయన అకాల మరణం శివరామకృష్ణ రావు ఊహించని షాక్.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపిన శివరామకృష్ణ రావు మానస సరోవర్, చార్‌దాం, అమర్‌నాథ్‌తో పాటు శక్తి పీఠాలను సందర్శించారు.

రిషికేష్ కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు. మూడు నెలలుగా పూర్తి ఆధ్యాత్మిక జీవితం వైపు ఆకర్షితుడైన ఆయన ఎట్టకేలకు సన్యాసదీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వ విదానందసరస్వతీ ఆధ్వర్యంలో దీక్షా తీసుకున్నారు.

ప్రజల అభిమానం ఆశీస్సులతో తాను ఈ స్థాయికి చేరుకున్నారని శ్రీ శివరామానంద సరస్వతి తెలిపారు. అందరిలో భగవంతుడు ఉన్నాడని, ఆయన సూచనలతోనే తాను సన్యాస దీక్ష తీసుకున్నానన్నారు. సర్వకాల సర్వావస్థలయందు భగవంతుని చింతనతోనే జీవితం గడపాలన్న ది లక్ష్యమన్నారు.

మొత్తానికి ఓ సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే రాజకీయాలను వదిలి సన్యాసం స్వీకరించడం బలమైన నిర్ణయమే. దీంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
 

click me!