బద్వేల్ ఉప ఎన్నిక (Badvel Bypoll) పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి ఆసక్తి.. ఫలితాలపై ఉంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఎలా ఉండవచ్చనే పలువురు రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
బద్వేల్ ఉప ఎన్నిక (Badvel Bypoll) పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి ఆసక్తి.. ఫలితాలపై ఉంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఎలా ఉండవచ్చనే పలువురు రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమేనని అంతా భావిస్తున్నారు. అయితే భారీ విజయం సొంతం చేసుకుంటుందని.. దాదాపు 80-85 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా కోల్పోవాల్సి వస్తుందని, బీజేపీ కేవలం డిపాజిట్ దక్కించుకుంటుందని కానీ భారీ ఓట్లు సాధించలేకపోయిందని వారు విశ్లేషిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో లేకపోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు కొంత బీజేపీకి అనుకూలంగా మారిందని ఎన్నికలను పరిశీలించిన వారు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బద్వేలు ఉప ఎన్నికలో ప్రచారం చేయకపోవడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలకు ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు అప్పగించారు. కోవిడ్ -19 నిబంధనల దృష్ట్యా తాను ప్రచారం చేయబోనని వైఎస్ జగన్ ఓటర్లకు లేఖ రాశారు. అయితే, వైసీపీ అభ్యర్థి డి సుధ లక్ష మెజారిటీ లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేశారు.
Also read: Badvel ByPoll: అవన్నీ దొంగ ఓట్లే.. అందుకే పోలింగ్ పెరిగింది: సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు
అయితే బద్వేల్ నియోజకవర్గంలోని పలుచోట్ల పోలింగ్ రోజు, పోలింగ్‌కు ముందు రోజు కూడా భారీ వర్షాలు కురవడంతో పోలింగ్‌పై ఎఫెక్ట్ పడింది. పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 68.12 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ నిర్దేశించిన లక్ష మెజారిటీ లక్ష్యం టచ్ కాకపోయిన.. ఆ పార్టీ అభ్యర్థికి కనీసం 80,000 మెజారిటీ రావొచ్చని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
ఇక, బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధను ఆ పార్టీ బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధిగా సురేష్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి. గత సంప్రదాయాలకు అనుగుణంగా పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేనలు నిర్ణయం తీసుకొన్నాయి. అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత కూడా పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. మరోవైపు ఇదే రకమైన నిర్ణయంతో జనసేన కూడా పోటీకి దూరమైంది. జనసేన నిర్ణయంతో బీజేపీ ఈ స్థానం నుండి పోటీ చేస్తోంది.
అయితే టీడీపీ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకులు పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి సురేష్ కోసం పని చేసినట్టుగా వైసీపీ ఆరోపిస్తుంది. పలు చోట్ల బీజేపీ అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీకి చెందినవారు ఉన్నారని వైసీపీ వర్గా ప్రధాన ఆరోపణ. ఇందుకోసం టీడీపీ సీనియర్ నేత ఒకరికి కోట్ల రూపాయలు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం వైసీపీ.. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నికలో వైసీపీకి 80 వేలకు పైగా మెజారిటీని అంచనా వేస్తుండగా.. బీజేపీకి దాదాపు 30 వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. బద్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 2,15,292 మొత్తం ఓటర్లు ఉండగా.. 1,46,657 ఓట్లు పోలయ్యాయి.