Badvel Bypoll Live Update: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు 59.58 శాతం ఓటింగ్

By Arun Kumar PFirst Published Oct 30, 2021, 7:00 AM IST
Highlights

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే మరణంతో ఉపఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇక్కడ పోలింగ్ జరగనుంది. 

బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసిన తర్వాత క్యూలో వున్న వారికి కూడా ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం ఓటింగ్ నమోదైంది. 

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు అక్కడ 59.58 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు ఓటు వేయడానికి సమయం వుండటంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం వుందని అధికారులు అంటున్నారు. 

బద్వేలు నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని.. ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. 

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్‌ సందర్భంగా 103వ నెంబర్ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతోందని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నకిలీ ఓటర్ కార్డ్‌లతో వైసీపీ ఓట్లు వేయించిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోరుమామిళ్లలో 58, అట్లూరులో 24, బీ.కోడూరులో 21 పోలింగ్‌బూత్‌లలో రిగ్గింగ్ జరుగుతోందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. వైసీపీ నేతలు చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవాలని కోరింది. పరిస్ధితి రీ పోలింగ్ వరకు వెళ్లకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. 

బద్వేల్ లో ఇప్పటివరకు 35 శాతం పోలింగ్ పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం ఏడుగంటల నుండి మద్యాహ్నం ఒంటిగంట వరకు ఇంత పోలింగ్ శాతం నమోదయ్యింది. 

బద్వేలు పరిధిలో బీజేపీ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేత సీఎం రమేష్ అన్నారు.  ఈ ఉపఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను కాకుండా  స్థానిక పోలీసులను రక్షణగా ఉంచుతున్నారన్నారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులను మోహరించారని సీఎం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయం లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్.

కడప కలెక్టరేట్ లోని స్పందన హాలులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు.  

బద్వేల్ లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం  ఏడుగంటల నుండే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు తరలారు. దీంతో 11గంటలవరకు 23 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

బద్వెల్ లో పోటీచేమంటూనే బహిరంగంగా టిడిపి బిజెపికి మద్దతిస్తోందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. బిజెపి పోలింగ్ ఏంజెంట్లుగా టిడిపి నాయకులు వుండటమే ఇందుకు నిదర్శనమన్నారు.  

బద్వేల్ ఉపఎన్నికలో భాగంగా జరుగుతున్న పోలింగ్ లో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే అంటే ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు 10.49 శాతం పోలింగ్‌ నమోదైంది.

బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా బిజెపి ఏపీ అధ్యక్షుడు సోమి వీర్రాజు కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బిజెపి ఏజెంట్లను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఎస్సై చంద్రశేఖర్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించారు.

ఇక తిరువెంగళాపురం పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు లేవని సోము వీర్రాజు అన్నారు. పోరుమామిళల్లో బయటి వ్యక్తులు మోహరించారని ఆయన ఆరోపించారు. దీనిపైనా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

చింతలచెరువు పోలింగ్ కేంద్రంలో తమ ఏజెంట్ ను అనుమతించలేదని బిజెపి ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీతో పాటు ఎన్నికల అధికారులకు బిజెపి పిర్యాదు చేసింది. 

పుట్టాయపల్లి, బొగ్గారిపల్లి పోలీస్ అధికారులు బెదిరిస్తున్నారంటూ బిజెపి ఫిర్యాదు చేసింది. తిరువెంగళాపురంలో  భద్రత దళాల భద్రత లేకుండానే పోలింగ్ జరుగుతోంది. 

బద్వేల్ ప్రజలు ఓటేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో  పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్‌ను ఏఎస్పీ మహేష్‌కుమార్ పరిశీలించారు.

పోలింగ్ కు  ముందురోజు శుక్రవారం బద్వేల్ నియోజకవర్గపరిధిలో భారీ వర్షం కురిసింది. దీంతో ఇవాళ వాతావరణం సజావుగా  పోలింగ్ జరిగేందుకు అనుకూలిస్తుందో లేదోనని అభ్యర్థులతో పాటు ప్రజలు, అధికారపార్టీలు ఆందోళన చెందారు. అయితే ఇప్పటికయితే వర్షం కురవడంలేదు. దీంతోఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు కదులుతున్నారు. 

బద్వేల్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతుల్లో ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ ని స్టార్ట్ చేసారు అధికారులు. 

కడప:  కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమయ్యింది.  ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధను ఆ పార్టీ బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధిగా సురేష్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి. గత సంప్రదాయాలకు అనుగుణంగా పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేనలు నిర్ణయం తీసుకొన్నాయి. అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత కూడా పోటీకి దూరంగా ఉండాలని  టీడీపీ నిర్ణయం తీసుకొంది. 
 
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను 281 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ పోలింగ్ స్టేషన్లలో 148 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా పోలీస్ అధికారులు గుర్తించారు.సెంట్రల్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని పోలింగ్ కోసం వినియోగించారు.ఈ నియోజకవర్గంలో 2.16 లక్షల మంది ఓటర్లున్నారు.  ఇందులో 1,07,915 మంది పురుషులు,1,07,355 మంది మహిళలున్నారు. మరోవైపు 22 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారని ఏపీ అధికారులు ప్రకటించారు.  

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్  క్షేత్రస్థాయి పోలీసులకు సూచించారు.మంచినీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్‌పెన్నులు, మొబైల్‌ ఫోన్లు మొదలైన వాటిని పోలింగ్‌ బూత్‌లలోకి అనుమతించకూడదని సూచించారు. పోలింగ్‌ బూత్‌ నుంచి 100 గజాల లోపు జనసందోహం లేకుండా చూసుకోవాలని కోరారు.జిల్లా సరిహద్దుల్లో 23 చెక్‌పోస్టులు, నియోజకవర్గ సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఒక్కో చెక్‌పోస్టులో పది మందిని నియమించామని ఎస్పీ తెలిపారు.  ఎన్నికలు పూర్తయ్యేంత వరకు హోటళ్లు, లాడ్జిలు, ఫంక్షన్‌ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు.

click me!