
గుంటూరు: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం, టీడిపి అధినేత చంద్రబాబు నాయుడికి సీఐడి కేసులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు మరోసారి స్పందించారు. దళితుల పేరిట మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడికి తప్పుడు సమాచారమిచ్చారంటూ ఓ మహిళ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరు సోషల్ మీడియా వేదికన సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.
''పదోతరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిపోయిన బుద్ధి ఇంకా జగన్‌రెడ్డి మార్చుకోలేదు. ఇచ్చిన ప్రతీ మాట తప్పుడు, వేసిన ప్రతీ అడుగు తప్పుడుతో ఇప్పటికే ఫేక్ సీఎం అనిపించుకున్నాడు. అమరావతి రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదులు ఇచ్చి ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నాడు. అమరావతి అసైన్డ్ భూములపై దర్యాప్తు చేస్తున్న పోలీసులైనా నిజమైనోళ్లా? లేక ఫేక్ సీఎం ఇచ్చిన ఫేక్ ఫిర్యాదులాంటి ఫేక్ ఖాకీలా?'' అని అయ్యన్న ప్రశ్నించారు.
''ప్రతిపక్షంలో వున్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకరించి, పాలకపక్షంలోకొచ్చాక కక్ష కట్టి మరీ అమరావతి అంతానికి కుట్రలు చేస్తూనే వున్నావు. వికేంద్రీకరణ పేరుతో అమరావతిపై నువ్వు చిమ్ముతున్న విద్వేషపు విషాన్ని...టిడిపి జనం ముందు ఉంచింది. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరించినా జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చెప్పేవన్నీ అబద్ధాలు అని జనం కుండబద్దలు కొట్టారు. అసత్యప్రచారాలే పునాదులు నిర్మించుకున్న అధికారం కూలిపోయే రోజు దగ్గర పడింది జగన్‌రెడ్డి'' అని అయ్యన్న హెచ్చరించారు.
read more ఫేక్ ఎమ్మెల్యే ఆర్కే సీఐడీ ఫిర్యాదు ఫేకే...ఈ మహిళ మాటలే సాక్ష్యం..: నారా లోకేష్ (వీడియో)
ఇక అచ్చెన్నాయుడు... ''సీఎం జగన్‌రెడ్డి ఆయన గ్యాంగ్ ప్రజారాజధానిపై పగబట్టారని మరోసారి సాక్ష్యాధారాలతో వెల్లడైంది. కూలగొట్టడమేకానీ, కట్టడం రాని జగన్‌రెడ్డి, ప్రజావేదికతో ఆరంభించిన విధ్వంసం, అమరావతి వరకూ కొనసాగిస్తున్నారు. 22 నెలల పాలనలో ప్రజారాజధానిపై పదులసంఖ్యలో విచారణలు వేయించిన సీఎం, ఒక అక్రమంగానీ, ఒక్క రూపాయి అవినీతిగానీ జరిగిందని నిరూపించలేకపోయాడు. చివరికి తన డీఎన్ఏలో భాగమైన ఫేక్ ప్రచారాస్త్రం తీశారు'' అని మండిపడ్డారు.
''అసైన్డ్ దళిత రైతుల పేరుతో మంగళగిరి ఎమ్మెల్యే కిరాయి మనిషి జాన్సన్, వాలంటీర్ అయిన కాపు మహిళని దళిత రైతులంటూ సీఐడీకి ఇచ్చిన ఫేక్ ఫిర్యాదుల గుట్టుని టిడిపి రట్టు చేసింది. సీఐడీకి తప్పుడు ఫిర్యాదులివ్వడం, కోర్టుల్ని తప్పుదోవ పట్టించిన ఈ కుట్రకి పాత్రధారి అయిన ఎమ్మెల్యే ఆళ్ల రెడ్డి, సూత్రధారి సీఎం జగన్‌రెడ్డిలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి'' అచ్చెన్న డిమాండ్ చేశారు.