ఒకే వేదికపై అవంతి, గంటా: కలిసిన పాత మిత్రులు, తాజా శత్రువులు

By telugu teamFirst Published Feb 12, 2021, 10:51 AM IST
Highlights

తాజా రాజకీయ ప్రత్యర్థులు గంటా శ్రీనివాస రావు, అవంతి శ్రీనివాస రావు ఒకే వేదికపైకి వచ్చారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన వారిని కలిపింది.

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమం పాత మిత్రులను, తాజా శత్రువులను కలిపింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస రావు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు శుక్రవారం ఒకే వేదిక మీదికి వచ్చారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తలపెట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కలిసి రావాలని అవంతి శ్రీనివాస్ రావు కోరారు. భూములు కాజేయాలని పోస్కో ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. బెంగాల్, ఒడిశాల్లో పరిశ్రమలు పెట్టుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. 

ఈ రోజు తమ వైసీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుస్తారని ఆయన చెప్పారు. ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరం చేసే హక్కు ప్రధానికి, సీఎంకు ఉండదని ఆయన అన్నారు. పక్క రాష్ట్రం కేంద్ర మంత్రి వల్ల ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు. రాజీనామాలు తుది అస్త్రం కావాలని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం తరహాలో ఉక్కు ప్లాంట్ ఉద్యమం ఉండాలని గంటా శ్రీనివాస రావు అన్నారు. మిలీనియం మార్చ్ నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు.

ఇదిలావుంటే, గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారని, ఆ ప్రయత్నాలను అవంతి శ్రీనివాస రావు అడ్డుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. గతంలో మంచి మిత్రులుగా ఉన్న వారిరువురు ఆ విషయంలో రాజకీయ ప్రత్యర్థులుగా మారారని అంటున్నారు. తాజాగా వారిద్దరు శుక్రవారం ఒకే వేదిక మీదికి రావడం ఆసక్తి కలిగిస్తోంది.

click me!