జనసేన సర్పంచ్ పై దాడి... గట్టిగానే బదులిస్తాం..: వైసిపికి నాదెండ్ల వార్నింగ్

By Arun Kumar PFirst Published Apr 9, 2021, 2:58 PM IST
Highlights

జనసేన పార్టీ తరపున గెలిచిన దూసనపూడి గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి నాగసాయిపై వైసీపీ వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలోని దూసనపూడి గ్రామ సర్పంచ్, జనసేన నాయకుడు యర్రంశెట్టి నాగసాయిపై వైసీపీ వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అత్యంత క్రూరమైన ఈ దాడి అధికార పార్టీవాళ్ళ రాక్షసత్వాన్ని తెలియచేసిందన్నారు. 

''పంచాయతీ ఎన్నికలలో వైసిపిని భీమవరం ప్రజలు ఛీత్కరించారు. అదే ఫలితం ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందనే ఉద్దేశంతోనే జనసేన నాయకులని, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది ఆ రాక్షస పార్టీ. ఇందులో భాగంగా యర్రంశెట్టి నాగసాయిపై హత్యాయత్నాన్ని పాల్పడ్డారు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు సాయి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు'' అని పేర్కొన్నారు. 

''వీరవాసరం మండలంలోని మత్స్యపురి గ్రామంలో జనసేన మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో గెలిచాక వైసీపీ గూండాలు చేసిన దాడులు, భీమవరం ఎమ్మెల్యే సృష్టించిన భయానక పరిస్థితులకు దూసనపూడి సర్పంచ్ మీద హత్యాయత్నం కొనసాగింపుగా ఉంది. కచ్చితంగా ఇలాంటి దాడులకు బలంగానే ప్రజాస్వామ్య పద్ధతుల్లో బదులిస్తాం'' అని హెచ్చరించారు. 

read more  వకీల్ సాబ్ మానియా: ఎమ్మెల్యేకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సెగ

''ఎన్నికల సమయంలో వైసీపీ గూండాలు ప్రత్యర్థులపై దాడులకు పాల్పడి, హత్యాయత్నానికి ఒడిగడుతుంటే పోలీసు యంత్రాంగం ఎందుకు అదుపు చేయలేకపోతుంది? నిన్నటి పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు యధేచ్చగా రిగ్గింగ్ కు పాల్పడటం చూశాక రాష్ట్ర ఎన్నికల సంఘం చేష్టలుడిగి, అలంకారప్రాయంగా మారిందన్న విషయం ప్రజలకు అర్థమైంది'' అన్నారు. 

''పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం పెరికపాడు పోలింగ్ బూత్ లో ఓటర్లు వెళ్ళక ముందే బ్యాలెట్ పత్రాలపై వైసీపీ గుర్తుపై ముద్రలు వేశారంటే ఇక ఎన్నికలు ఎందుకు? తప్పుల తడకగా బ్యాలెట్ పత్రాలు ముద్రించారు... మరో చోట జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు లేదు.. జనసేన ఏజెంట్లను పోలింగ్ బూత్ లోకి అనుమతించరు... ఇక ఎవరి కోసం ఈ ఎన్నికలు?'' అని మండిపడ్డారు. 

''ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసిన ఇలాంటి ఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు? పోలింగ్ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తాం. ఎన్నికల ప్రక్రియకు ఎక్కడైతే విఘాతం కలిగిందో, ఎక్కడైతే రిగ్గింగ్ చేశారో అక్కడ కచ్చితంగా రీ పోలింగ్ నిర్వహించాలి'' అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. 

 
 

click me!