సీఎంవో ఆదేశాలతోనే ఉమపై దాడి... పోలీసులూ ఈ కుట్రలో భాగమే: మాజీ మంత్రి సంచలనం

By Arun Kumar PFirst Published Jul 28, 2021, 2:26 PM IST
Highlights

ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ఏం చెబితే పోలీసులు అదిచేస్తున్నారని... మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి కూడా అలాగే జరిగిందని టిడిపి నాయకులు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.  

అమరావతి: మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించడాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తప్పుబట్టారు. ఆయనతో పాటు మరో 17మంది టిడిపి నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులుపెట్టి అందరినీ జైలుకు పంపడానికి పోలీసులు సిగ్గులేకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

''ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చెబితే పోలీసులు అదిచేస్తున్నారు. నూటికి నూరుశాతం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ చెప్పారు. కానీ ఎక్కడా ఈ పారదర్శకత కనిపించడం లేదు'' అని ఆనంద్ బాబు పేర్కొన్నారు. 

''నిన్న(మంగళవారం) సాయంత్రం కొండపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని దేవినేని ఉమామహేశ్వరరావు నిర్ణయించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. దాన్ని పరిశీలించడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి దేవినేని ఉమా వెళ్లారు'' అని తెలిపారు. 

''మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి సాయంత్రం తిరిగొచ్చేటప్పుడు ఆయన వాహనాన్ని ఆపిన స్థానిక ఎస్సై అటువెళ్తే వైసీపీ వారున్నారు కాబట్టి ఇటు వెళ్లండని వేరే రూటులో పంపించాడు. ఈ క్రమంలోనే జి.కొండూరు వైపు వెళ్లమని ఎస్సై చెప్పడంతోనే ఆయన తన వాహానాన్ని అటువైపు పోనివ్వమన్నారు. ఆ రూటులోకి వెళ్లగానే సుమారు 100 మందివరకు వైసీపీ కార్యకర్తలు, కార్యకర్తల ముసుగులో ఉన్న గూండాలు ఉమాపై దాడికి తెగబడ్డారు. ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. స్థానిక ఎస్సై, కానిస్టేబుళ్లు అందరూ ఘటనా స్థలంలోనే ఉన్నారు. అంత జరిగితే రాత్రి 01.15 నిమిషాల వరకు పోలీసులెవరూ దేవినేని ఉమా వద్దకువెళ్లి మాట్లాడింది లేదు. ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు అటవీప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ పరిశీలనకు వెళితే ఆయనపై దాడిచేసిన వారిని పట్టుకోకుండా, తిరిగి ఆయనపైనే తప్పుడుకేసులు పెడతా రా?'' అని పోలీసులను ప్రశ్నించారు. 

read more  దేవినేని ఉమపై దాడి... పోలీస్ బాసుగా మీ సమయమిదే: డిజిపికి చంద్రబాబు లేఖ

''దేవినేని ఉమాని కారు దిగకుండా నిర్బంధంలో ఉంచి, ఆయన నుంచి ఫిర్యాదుకూడా తీసుకోకుండా పోలీసులు వ్యవహరించారు. రాత్రి 01.15 నిమిషాల తర్వాత కారు వెనుక అద్దాలు పగలగొట్టిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తరువాత రాత్రి 03.00గంటల ప్రాంతంలో ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. రాత్రి 04.15 ని. లకు నందివాడకు తరలించామని చెప్పారు. నందివాడ గ్రామంలోకి నరమానవుడిని ప్రవేశించకుండా పోలీసులు మొత్తం బారికేడ్లతో మూసేశారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అర్థరాత్రి ఖూనీ చేశారు'' అని మండిపడ్డారు. 

''దేవినేని ఉమాపై 307 సెక్షన్ కింద కేసు పెట్టడమేంటి? ఆయనపై దాడి జరిగింది... ఇలా దాడిచేసిన వారిని వదిలేసి దాడికి గురైన వ్యక్తిపై తప్పుడు కేసులు పెడతారా? దాసరి సురేశ్ అనే దళిత యువకుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సెక్షన్, 307సెక్షన్ల కింద కేసులు పెట్టారు'' అన్నారు. 

''నిన్న సాయంత్రం 05.40 ని.లకు ఘటన జరిగిందని చెబుతున్నారు. 6.20ని.లకు కూడా దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడేది తాము చూశాము. 06.20తరువాతే దేవినేని ఉమామహేశ్వరరావు తన వాహానంలో జీ.కొం డూరువైపు వెళ్లడానికి ప్రయత్నించారు. జరిగింది ఒకటైతే జిల్లా ఎస్పీ మరోరకంగా కథలు అల్లుతున్నాడు. నిన్నటివరకు వ్యవస్థలపై దాడిచేశారు...ఇప్పుడేమో భౌతికంగానే దాడికి యత్నించారు. మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్యుడికి ఏం రక్షణ ఉంటుంది?'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''దేవినేని ఉమా ఫిర్యాదు తీసుకోకుండా తిరిగి అవతలి వారిని స్వయంగా స్టేషన్ కు పిలిపించిమరీ పోలీసులు వారినుంచి కేసులు తీసుకున్నారు. ఈవ్యవహారమంతా స్థానిక ఎమ్మెల్యే, సీఎంవో ఆదేశాల ప్రకారమే జరిగింది. దేవినేని ఉమా అనే వ్యక్తి ఎక్కడ దొరుకుతారా అని ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆయనపై తప్పుడు కేసులన్నీ పెట్టి, జైలుకు పంపడానికి ఏర్పాట్లు చేశారు'' అని ఆరోపించారు. 

''రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ మాఫియా అనేది విచ్చలవిడిగా పేట్రేగిపోతోంది. విశాఖ మన్యంలో జరుగుతున్న బాక్సైట్ మైనింగ్ పరిశీలించడానికి వెళ్లిన తమను కూడా గతంలో పోలీసులు ఇలానే అడ్డుకున్నారు. అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన దేవినేని ఉమాని కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారు.ఈ  విధమైన దోపిడీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయమే తలమునకలై ఉంది. అక్రమ కేసులు, తప్పుడు విధానాలతో టీడీపీవారిని భయపెట్టలేరు. ప్రభుత్వం, వైసీపీ గూండాలు భౌతికదాడులు మానుకోకుంటే వారు భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు'' అని నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు. 
 

click me!