Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. టీడీపీ బరిలో నిలుస్తుందా..?

By Sumanth KanukulaFirst Published May 30, 2022, 5:11 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నికకు సోమవారం ( మే 30) నోటిఫికేషన్ విడుదలైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి జూన్ 23న పోలింగ్ జరపనుంది. నోటిఫికేషన్ వెలువడిన రోజే.. రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నికకు సోమవారం ( మే 30) నోటిఫికేషన్ విడుదలైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి జూన్ 23న పోలింగ్ జరపనుంది. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఎన్నిక సంఘం షెడ్యూల్ విడుదల చేయగా.. నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వెలువడిన రోజే.. రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే మేకపాటి కుటుంబం.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు వారి నిర్ణయాన్ని తెలియజేశారు. ఇందుకు జగన్ కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.

మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో నిలవనున్నట్టుగా ప్రకటించింది. అయితే టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందా..? లేదా..? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిని పోటీకి ఉంచాలా..? వద్దా..? అనే దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారయణ రెడ్డి కూతురు కైవల్యా  రెడ్డి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసిన నేపథ్యంలో.. ఆమె టీడీపీ నుంచి ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో నిలబడతారనే ప్రచారం సాగుతుంది. 

ఇక, ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు జూన్‌ 6 చివరి తేదీ. జూన్ 7వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూన్ 9వ తేదీని నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అదే రోజు బరిలో ఉన్నఅభ్యర్థుల ఎవరనేది తేలనుంది. ఇక, జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్‌ 26న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్‌ 28న ఉప ఎన్నికల షెడ్యూల్‌ ముగుస్తుంది. ఈ క్రమంలోనే మే 25 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది.

ఆత్మకూరు ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఎంఎన్ హరేంధీర ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఇక, ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,330 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,05,924 మంది పురుషులు, 1,07,733 మంది మహిళలు, 11 మంది థర్డ్ జెండర్, 62 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4,981 మంది ఉన్నారని, వారికి పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 
 

click me!