సీఎం జగన్ దిగిరాక తప్పలేదు... ఈ విజయం వారిదే: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Jul 29, 2021, 2:46 PM IST
Highlights

ధాన్యం బకాయిలు నెలల తరబడి చెల్లించకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని... ఈ  నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. 
 

అమరావతి:  గతేడాది రబీకి సంబంధించిన ధాన్యం బకాయిలు ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాక విడుదల చేశారు... ఇదీ రైతుల పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బకాయిల విడుదలకు వైసిపి సర్కార్ నెలల తరబడి ఆలస్యం చేయడంతో అన్నదాతలు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలా రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

''తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ధాన్యం బకాయిల చెల్లింపు కోసం రోడ్డెక్కారు. దీంతో జగన్ రెడ్డి దిగివచ్చారు. ధాన్యం బకాయిలు చెల్లింపు విజయం రోడ్డెక్కిన రైతులది'' అని అచ్చెన్న పేర్కొన్నారు. 

''వ్యవసాయ రంగం పట్ల జగన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. గత ఐదారు నెలలుగా ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించలేదు. రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ఎవరు భరిస్తారు? చంద్రబాబు హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నగదు చెల్లించారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత గడువును 21 రోజులకు పెంచారు. అయినా గడువులోగా చెల్లించడంలో విఫలమయ్యారు'' అన్నారు.

read more  ఎస్సీ, ఎస్టీ చట్టం లేకుండా చేయాలని వైసీపీ కుట్రలు...ఇదే ఉదాహరణ: మాజీ మంత్రి నక్కా ఆందోళన

''రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు అడ్డాలుగా మారాయి. మరోవైపు ఈ-క్రాప్ నమోదులో నిర్లక్ష్యంతో ధాన్యం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి క్వింటాకు రూ.300 నుంచి రూ.800 వరకు నష్టపోయారు. మిల్లర్లు, వైసీపీ నేతలు కలిసి రైతులను దోచుకున్నా పట్టించుకోలేదు. తడిసిన ప్రతి గింజను కొంటామనే హామీని కూడా జగన్ రెడ్డి విస్మరించారు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో వారంతా అప్పుల్లోకి కూరుకుపోతున్నారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఏపీలో రూ.1.69 లక్షల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉందని లోక్ సభలో కేంద్రం వెల్లడించడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా జగన్ రెడ్డి కష్టాల్లో ఉన్న రైతులకు గత ప్రభుత్వం వలే రైతు రుణమాఫీ చేయాలి. అవినీతి, దుబారా అరికడితే రైతు రుణమాఫీ కూడా సాధ్యమే'' అని అచ్చెన్న సూచించారు. 

click me!