బట్టలు చింపేసి మరీ దాడి... దళిత ఎమ్మెల్యేకు ఇంత అవమానమా..: అచ్చెన్నాయుడు సీరియస్

By Arun Kumar PFirst Published Jun 5, 2023, 2:34 PM IST
Highlights

కొండెపి నియోజకవర్గంలో వైసిపి, టిడిపి ల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంపై ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. 

ప్రకాశం : అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నిరసనలతో ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి, వైసిపి ఇంచార్జి వరికూటి అశోక్ బాబు పరస్పరం ఒకరి ఇంటిని మరొకరు ముట్టడికి పిలుపునిచ్చారు. ఇలా వైసిపి శ్రేణులు ఛలో నాయుడుపాలెం, టిడిపి శ్రేణులు ఛలో టంగుటూరుకు సిద్దమయ్యారు.ఇలా టిడిపి శ్రేణులతో కలిసి అశోక్ బాబు ఇంటి ముట్టడికి బయలుదేరిన ఎమ్మెల్యే వీరాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో టిడిపి శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

కొండెపి నియోజకవర్గంలో ఉదయం నుండి చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. ఎమ్మెల్యే వీరాంజనేయులుపై వైసిపి నాయకులు దాడికి యత్నించారని... దుస్తులు చించి దారుణంగా వ్యవహరించడం వైసిపి ప్రభుత్వ సైకోయిజానికి నిదర్శనమని అన్నారు. దాడికి పాల్పడిన వైసిపి నేతలను వదిలిపెట్టి బాధిత ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం అనైతికం, అప్రజాస్వామికమని అచ్చెన్నాయుడు అన్నారు. 

వివాద రహితుడు, ప్రజల్లో మంచిపేరున్న ఎమ్మెల్యే వీరాంజనేయులుకు అవినీతి మరకలు అంటగట్టాలని వైసిపి చూస్తోందని అచ్చెన్న అన్నారు. ఆయన ప్రతిష్ట దెబ్బతీయడానికే అవినీతి ఆరోపణలు చేస్తూ ఇంటి ముట్టడికి వైసిపి పిలుపునిచ్చిందని అన్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడికి పాల్పడటం దారుణమని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Read More కొండెపిలో ఢీ అంటే డీ అంటున్న వైసీపీ, టీడీపీ.. పోలీసులు అదుపులో ఎమ్మెల్యే.. నియోజకవర్గంలో హై టెన్షన్..

అవినీతి పాల్పడటం, లూటీలు చేయడంలో వైసిపి పేటెంట్ హక్కులు వున్నాయని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేసారు. చిన్నారులకు ఇచ్చే పాలు, స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీలలో కూడా కమీషన్లు కొట్టేసిన చరిత్ర వైసిపి నాయకులది అని మండిపడ్డారు. అలాంటి వైసిపి నాయకులు ప్రతిపక్ష టిడిపి నాయకులకు అవినీతి మరకలు అంటించేందుకు కుట్రలు పన్నుతున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

దళిత ఎమ్మెల్యేలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. వీరాంజనేయ స్వామి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే కక్షగట్టి ఇలా దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఈ దాడులు, బెదిరింపులతో భయపడిపోయే రకం ఎమ్మెల్యే స్వామి కాదన్నారు. దళితులను అవమానిస్తున్న జగన్ రెడ్డికి ఆ దళితులే బుద్దిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు అచ్చెన్నాయుడు. 

అరెస్ట్ చేసిన టిడిపి ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిని వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. ప్రజలకోసం పనిచేసే టిడిపి నాయకులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా లాభం వుండదని... ప్రజలకోసం ఎంత దూరమైనా వెళతారని వైసిపి నాయకులు, జగన్ ప్రభుత్వం గుర్తుంచుకుంటే మంచిదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

click me!