లోకేష్ అలుపెరగని పోరాటం... జగన్ కు దిగిరాక తప్పలేదు: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Jun 25, 2021, 11:14 AM IST
Highlights

మొండి పట్టుదలతో పరీక్షల నిర్వహణకు పోవాలనుకున్న జగన్ రెడ్డికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తే గాని దిగిరాక తప్పలేదన్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.

 అమరావతి: విద్యార్ధులు, యువత తలుచుకుంటే దేనినైనా సాధిస్తారని మరో సారి నిరూపణ అయ్యిందన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. మొండి పట్టుదలతో పరీక్షల నిర్వహణకు పోవాలనుకున్న జగన్ రెడ్డికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తే గాని దిగిరాక తప్పలేదన్నారు.

''కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి ఇప్పటికి క్లారిటీ వచ్చిందా?  పరీక్షల రద్దు విద్యార్ధులు, తల్లిదండ్రుల విజయం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్ధుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తే జగన్ రెడ్డి మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లనట్లుగా పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. నారా లోకేష్ పరీక్షల రద్దు కోసం రెండు నెలల నుంచి  విద్యార్ధుల అలుపెరగని పోరాటం చేశారు. ఆఖరికి న్యాయ పోరాటాకైనా వెనుకాడలేదు. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యం అందుకే పరీక్షలు రద్దు చెయ్యమని డిమాండ్ చేశారు'' అని తెలిపారు. 

read more  ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్

''విద్యార్దులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి అందరిని ఏకతాటిపైకి తేవడంలో లోకేష్ సఫలీకృతులయ్యారు.  ఎంత మంది చెప్పినా సీఎం జగన్ మొండి వైఖరితో పరీక్షల విషయంలో విద్యార్ధులు, తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు.  దేశ ప్రధాని సైతం విద్యార్ధులు, తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరీక్షలు రద్దు చేస్తే జగన్ రెడ్డికి వారితో చర్చించే సమయం లేదా?'' అని నిలదీశారు.  

''చివరకు సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టడంతో వైసిపి ప్రభుత్వం పరీక్షల రద్దు నిర్ణయం తీసుకుంది. ఇది హర్షణీయం. కరోనా సమయంలో జగన్ సర్కార్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా సుప్రీం కోర్టు ఆపగలిగింది'' అని అచ్చెన్నాయుడు  పేర్కొన్నారు. 

 

click me!