చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు... లేదు మరో ఐదురోజులు సిఐడి కస్టడీకి ఇవ్వాలని ఏఎజి విజయవాడ ఏసిబి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
విజయవాడ : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసిబి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజులపాటు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించిన సిఐడి మరో ఐదురోజులు కస్టడీ కావాలని కోర్టును కోరుతోంది. మరోవైపు చంద్రబాబు వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఇందుకు సిఐడి న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. చంద్రబాబు బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని... అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని సిఐడి న్యాయవాదులు అంటున్నారు.
విజయవాడ ఏసిబి కోర్టులో సిఐడి తరపున ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుండే వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఇరువురు లాయర్లు తమ వాదనలను రెండో రోజు కొనసాగిస్తున్నారు. దీంతో ఏసిబి కోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తుందా..? మళ్లీ కస్టడీకి ఇస్తుందా..? లేదంటే రిమాండ్ పొడిగిస్తుందా..? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని... ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా ఆయనే 13 చోట్ల సంతకాలు పెట్టారని పొన్నవోలు సుధాకర రెడ్డి తెలిపారు. రూ.27 కోట్లు నేరుగా ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. ఆర్టికల్ 14 ని ప్రస్తావించిన పొన్నవోలు న్యాయం ముందు అందరూ సమానమేనని అన్నారు. ముఖ్యమంత్రికైనా... సామాన్యుడికైనా న్యాయం ఒక్కటేనని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఇది సామాన్యమైన కేసు కాదు... తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు అని అన్నారు. మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం వుంది కాబట్టి మరో ఐదురోజులు చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలని కోరారు. బెయిల్ మంజూరు చేయడం వల్ల కేసు నీరుగారే ప్రమాదం వుందని ఏఎజి పొన్నవోలు వాదించారు.
Read More నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు.. మరోవైపు బెయిల్, కస్టడీ పిటిషన్‌ల విచారణపై ఉత్కంఠ..!
ఇక చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే మాత్రం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు కు సంబంధం లేదన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే రెండేళ్ల తర్వాత చంద్రబాబును ఈ కేసులో ఇరికించారని అన్నారు. చంద్రబాబు కేవలం సిఎం హోదాలో మాత్రమే స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు నిధులు మంజూరు చేశారన్నారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేసి రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నారు. ఇలా అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కాం ఎక్కడుంది? చంద్రబాబు పాత్ర ఏముంది? అని అడిగారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసని అన్నారు.
చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించకుండానే అరెస్ట్ చేసారని ప్రమోద్ దూబే తెలిపారు. ఇప్పటికే కస్టడీ లో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారని... కాబట్టి ఇక కస్టడీ కూడా అవసరం లేదన్నారు. ఈ అంశాలను పరిశీలన చేసి బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు చంద్రబాబు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే.