ఈ ఎంపి ఏ పార్టీలో ఉన్నారు?

First Published Jan 9, 2018, 10:11 AM IST
Highlights
  • పార్లమెంటు  సభ్యురాలు కొత్తపల్లి గీత గందరగోళంలో ఉన్నట్లున్నారు.

పార్లమెంటు  సభ్యురాలు కొత్తపల్లి గీత గందరగోళంలో ఉన్నట్లున్నారు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. దాంతో గీత అసలు ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రభుత్వ అధికారిణిగా కూడా పనిచేసిన కొత్తపల్లి పోయిన ఎన్నికల్లోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వివాదాస్పద గిరిజనురాలైన గీత విశాఖపట్నం జిల్లాలోని అరకు పార్లమెంటు స్ధానంలో వైసిపి తరపున పోటీ చేసారు. పోటీ చేసిన మొదటి సారే విజయం సాధించారు. అంతవరకూ బాగానే ఉంది.

గెలిచిన తర్వాతే అసలు కథ మొదలైంది. విజయం సాధించిన కొంత కాలానికే టిడిపి నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ మొత్తం టిడిపి వాళ్ళతోనే కనిపించారు. దాంతో వైసిపి నేతలు గీతను దూరం పెట్టేసారు. అదే సమయంలో గీత కూడా వైసిపి కార్యక్రమాల్లో పాల్గొనటం మానేసారు. దాంతో కొత్తపల్లికి వైసిపికి మధ్య అంతరం పెరిగిపోయింది.

ఈ నేపధ్యంలోనే గీత చంద్రబాబునాయుడును కలిసారు. తర్వాత టిడిపిలో చేరినట్లు స్వయంగా ప్రకటించుకున్నారు. అప్పటి నుండి టిడిపి నేతలతోనే ఎంపి తిరుగుతున్నారు.  టిడిపిలో కూడా గీతకు కొంతకాలం బాగానే సాగింది. హటాత్తుగా హైదరాబాద్ శివారులోని ఓ భూకుంభకోణం వెలుగు చూసింది. అందులో  గీత దంపతులే ప్రధాన పాత్రదారులు.  

సమైక్య రాష్ట్రంలోని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఆర్డీవోగా గీత పనిచేసినపుడు విలువైన భూమిని సొంతం చేసుకున్నారన్నది గీత దంపతులపై ప్రధాన ఆరోపణలు. ఇపుడా భూమి విలువ సుమారు రూ. 500 కోట్లు విలువుంటుందట. ఆ కుంభకోణంలో ప్రధానపాత్ర ఎంపి దంపతులదే అని తేలింది. దాంతో ఎంపి భర్తను ప్రభుత్వం అరెస్టు కూడా చేసింది.

కేసులో ఇరుక్కున్నపుడు తనను ఆదుకోమంటూ ఎంపి చంద్రబాబును కలిసిందట. అయితే, కేసులో జోక్యం చేసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారట. దాంతో అప్పటి నుండి చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు. తర్వాత ఓసారి మీడియాతో మాట్లాడుతూ తనకు టిడిపికి సంబంధం లేదని ప్రకటించేసారు.

ఇదంతా జరిగి చాలా కాలమైంది. అప్పటి నుండి అటు వైసిపిలో కనబడక, ఇటు టిడిపిలో లేక గీత ఏమైపోయారో ఎవరికీ అర్దం కాలేదు. ఇటువంటి నేపధ్యంలోనే మొన్న ప్రధానమంత్రిని కలిసిన టిడిపి బృందంలో గీత కూడా ఉన్నారు. కొత్తపల్లి ఏ కెపాసిటీలో టిడిపి బృందంతో కలిసి ప్రధాని వద్దకు వెళ్ళారో ఎవరికీ అర్ధం కావటం లేదు. రోజుకోమాట మాట్లాడుతున్న గీత వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతారేమో?

 

click me!