
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలుదఫాలుగా ఎన్నికల కమీషనర్ కి తెలియజేసామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సీఎస్ కూడా ఎన్నికలు సాధ్యం కాదని ఎన్నికల కమీషనర్ కి వివరించారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ, బీహార్ లలో ఎన్నికల తరువాతే కరోనా వ్యాపించిందని తెలిపారు. ఎన్నికల కమీషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేసారని, నోటిఫికేషన్ ని ఉపసంహరించుకోవాలని కోరారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోందని ఈ సమయంలో ఎన్నికలు పెడితే ప్రజలు కూడా కరోనా తో భయబ్రాంతులకు గురైయ్యే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు.
స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడలేదని ఇలాగే మొండిగా చేస్తే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు.
అవసరం అయితే కోర్ట్ లను ఆశ్రయిస్తామని, ప్రస్తుతం 9లక్షల కు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారని అన్నారు. ఎన్నికల కమిషనర్ ఉద్యోగుల ప్రాణాలకు భద్రత కల్పిస్తారా? అని ప్రశ్నించారు.
కరోనాతో చాలామంది ఉద్యోగులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని, ఎన్నికల నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.