అమ్మాయి మిస్సయ్యిదంటే... అసభ్యంగా మాట్లాడుతున్నారు: పోలీసుల తీరుపై రోజా ఫైర్

By Siva KodatiFirst Published Nov 30, 2019, 8:04 PM IST
Highlights

తల్లిదండ్రులు వెళ్లి మా అమ్మాయి కనిపించకుండా పోయిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ఎవడితోనే లేచిపోయిందేమో అని పోలీసులు వెటకారంగా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు.

ప్రియాంకరెడ్డి హత్యోదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రజలు, ప్రజాసంఘాలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా చేరారు. ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సంఘటనతో భయపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు ధైర్యం తెచ్చుకుంటున్న రోజుల్లో ప్రియాంక రెడ్డిపై జరిగిన దారుణాన్ని చూస్తే.. మనుషుల్లో మానవత్వం ఉండా..? అని అనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు.

ఆ నలుగురు నిందితులు మనుషులా.. లేక మానవ మృగాలా అనేది కూడా తమకు అర్ధం కావడం లేదన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను అభినందించాలా..? అదే ప్రాంతంలో మళ్లీ ఇంకో ఘటన జరిగినందుకు నిందించాలో తెలియడం లేదన్నారు.

ఒక అమాయకురాలిని అత్యంత దారుణంగా చంపిన ఆ మృగాలను కట్టుదిట్టమైన భద్రతతో ఎందుకు తీసుకెళ్లారని రోజా ప్రశ్నించారు. ఆ నలుగురిని ప్రజలకు అప్పగిస్తే వాళ్లే శిక్ష విధిస్తారని... నేరస్థుల్ని శిక్షించాలని అడిగితే జనం మీద లాఠీఛార్జీ చేయడం ఏంటనీ ఆమె ప్రశ్నించారు.

గతంలో ఇలాంటి నిందితులను ఉరి తీసినప్పుడు హ్యూమన్ రైట్స్ వచ్చాయని.. అమాయకమైన ఆడపిల్లల్ని రేప్ చేసి, కాల్చి చంపినప్పుడు లేని బాధ... వాళ్లను శిక్షించేటప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఎందుకు స్పందిస్తోందని ఆమె నిలదీశారు.

ఒక ఆడపిల్లపై అత్యాచారం చేసి, హత్య చేసినవాడు నరరూప రాక్షసుడై ఉంటాడని, అలాంటి వాడికి హ్యూమన్ రైట్స్ ఎందుకు మద్ధతుగా నిలుస్తున్నాయని రోజా ప్రశ్నించారు.

తల్లిదండ్రులు వెళ్లి మా అమ్మాయి కనిపించకుండా పోయిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ఎవడితోనే లేచిపోయిందేమో అని పోలీసులు వెటకారంగా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. ఆడపిల్లకు ఏమైనా జరిగితే ఏ ధైర్యంతో కంప్లయింట్ చేస్తారన్న ఆమె పోలీస్ స్టేషన్‌లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని రోజా అభిప్రాయపడ్డారు.

ప్రియాంక రెడ్డి నిందితులను పోలీసులు షాద్‌నగర్ నుంచి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. వీరి రాకను తెలుసుకున్న ప్రజాసంఘాలు, విద్యార్ధులు జైలు వద్దకు చేరుకుని నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. నలుగురు నిందితులను జైలులోని హై సెక్యూరిటీ బ్లాక్‌కు తరలించారు.

జనం భారీగా తరలిరావడంతో చర్లపల్లి జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిందితులను తమకు అప్పగించాలని లేదంటే తక్షణమే ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. పరిస్ధితి అదుపు తప్పడంతో పోలీసులు పలువురు నిరసనకారులను అరెస్ట్ చేశారు.  

click me!