స్టాలిన్ ను చూసి జగన్ బుద్ది తెచ్చుకోవాలి...: ఏపిపిసి చీఫ్ శైలజానాధ్

By Arun Kumar PFirst Published May 31, 2021, 2:34 PM IST
Highlights

కనీసం కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకయినా ఇప్పటి నుంచే జాగ్రత్తలు చేపట్టాలని జగన్ సర్కార్ ను ఏపిసిసి చీఫ్ శైలజానాథ్ సూచించారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అహంకార పొరల నుంచి బయటకి రావాలని మాజీ మంత్రి, ప్రస్తుత ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజా నాథ్ సూచించారు. ఇటీవలే తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ ను చూసి జగన్ బుద్ది తెచ్చుకోవాలని అన్నారు. కనీసం కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకయినా ఇప్పటి నుంచే జాగ్రత్తలు చేపట్టాలని శైలజానాథ్ సూచించారు. 

''ప్రస్తుతం ప్రజల కరోనా కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. ఆక్సిజన్ అందక, ఇంజక్షన్ దొరకక అనేక మంది చనిపోయారు. పాలకుల కను సన్నల్లో బ్లాక్ మార్కెట్ సాగింది. మోడీ, జగన్ సిగ్గు లేకుండా గొప్పలు చెప్పుకుంటున్నారు.ఏ ముఖం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు'' అని మండిపడ్డారు. 

''చనిపోయాక  ఆ కుటుంబాలకు ఏదో చేస్తామని చెప్పడం హాస్యాస్పదం. తల్లిదండ్రులు కోల్పోకుండా ముందే ఎందుకు మేల్కొనలేదు. మోడీ కనిపించరు, జగన్ బయటకి రారు.. వీరికి ప్రజల పాట్లు ఏం తెలుస్తాయి'' అని ఎద్దేవా చేశారు. 

''పిల్లలకు చెందిన వ్యాక్సిన్ ఇతర దేశాలకు అమ్ముకున్నారు. ప్రభుత్వాల లోపాలను ఎత్తి చూపితే మీడియా పై ఆంక్షలు పెడతారా? అంబానీ, అదానీ లు కోట్లు కూడేసుకుంటే... పేదలు కూటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదేనా మోడీ నీ పాలన గొప్పతనం..." అని విరుచుకుపడ్డారు.

read more  రూ.10వేల కోట్ల దోపిడీకి జగన్ మాస్టర్ ప్లాన్: మాజీ మంత్రి జవహర్ సంచలనం

''జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం అలవాటు చేసుకోవాలి. నేను విన్నాను, ఉన్నాను అని మాటలు చెప్పడం కాదు... ఆచరణ ఏది. రెండేళ్లల్లో ఎంత మంది వైద్యులను నియమించారు. ఈరోజు ఆసుపత్రుల నిర్మాణాలు, శంకుస్థాపన గ్రాఫిక్స్ లో బాగానే ఉంటాయి. రాష్ట్రం లో మందులు, శానిటైజర్, మాస్క్ లు కూడా ఇవ్వడం లేదు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఏపిలో ఎన్ని ఇళ్లు కట్టారు... విద్యార్థులకు ఎన్ని స్కాలర్ షిప్ లు ఇచ్చారు. ఎన్నికలకు ముందు నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చి మోసం చేశారు. జగన్ చెప్పే వాటికి, ఆచరించే వాటికి సంబంధం లేదు. రైతులు పంటకొనే వారు లేక అల్లాడుతున్నా మీకు పట్టదు. మీ లాంటి అసమర్థ పాలనతో ప్రజలు భవిష్యత్తు ఏమవుతుందోననే భయం నెలకొంది'' అన్నారు. 

''ఏపీలో అసలు పరిపాలన లేదు అనేది మా అభిప్రాయం. మీ సలహాదారులు లక్షల జీతాలు తీసుకుని ఏం చేస్తున్నారు. మీకు సలహాలు ఇవ్వకుండా... మాకు చెబుతున్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ పక్షాన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. మాటలు చెప్పడం మాని... మోడీ, జగన్ లు పని చేయడం తెలుసుకోవాలి'' అని శైలజానాధ్ సూచించారు. 

 

 

click me!