
అమరావతి: ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, వీఐపిల కాన్వాయ్ కోసం ఉపయోగించిన వాహనాల బిల్లులు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రవాణా శాఖ కోరింది. గత మూడేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో రూ.17.5 కోట్లు బకాయి పడ్డారని...ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ రవాణ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. పాత బకాయిలు వెంటనే చెల్లించకపోతే ముఖ్య నేతలతో పాటు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు కూడా వాహనాలు సమకూర్చలేమని రవాణా శాఖ తేల్చిచెప్పింది.
ఇటీవల జరిగిన రవాణా శాఖ సమీక్షలో భారీగా పేరుకుపోతున్న బకాయిలను వసూలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత మంత్రితో అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగినట్లు మరెక్కడా జరక్కుండా వుండాలంటే పాత బకాయిల చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా సుతిమెత్తగా హెచ్చరిస్తూ రవాణా శాఖ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టేందుకు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాన్వాయ్ వాహనాల అంశాన్ని రవాణా శాఖ తెరపైకి తెచ్చింది. సీఎం పర్యటనలో కాన్వాయ్ వాహనాల ఏర్పాటుకు తక్షణం బిల్లులు చెల్లించాలని రవాణా శాఖ ప్రభుత్వాన్ని కోరింది.
వీఐపీల కాన్వాయ్ వాహనాల ఏర్పాటుకు ఏటా కనీసం రూ.4.5 కోట్లు అవసరమన్న రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రతి ఏడాది బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని... ప్రత్యేక ఖాతా ద్వారా బిల్లులు చెల్లించాలని రవాణా శాఖ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. ఇలా బకాయిల చెల్లింపు కోసం రవాణా శాఖ ప్రభుత్వానికి లేఖరాయడంపై రాజకీయంగా చర్చకు దారితీసింది.
ఇటీవల సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు ముందు సీఎం కాన్వాయ్ కోసమంటూ ఓ కుటుంబాన్ని రోడ్డుపైనే వదిలేసి కారును లాక్కుపోయిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీంతో సీఎం కాన్వాయ్ కి వాహనాలు కావాలని తిరుపతికి వెళ్లే కుటుంబం నుండి వాహనం తీసుకెళ్లిన ఘటనపై ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. AMVIసంధ్య, హోంగార్డు తిరుపతిరెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
పల్నాడు జిల్లాలోని వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ కుటుంబం బుధవారం నాడు తిరుపతికి వెళుతూ ఒంగోల్ పట్టణంలో టిఫిన్ చేసేందుకు తమ వాహనాన్ని నిలిపివేశారు. వీరు టిఫిన్ చేస్తున్న సమయంలో ఆర్టీఏ కానిస్టేబుల్ వచ్చి వారి ఇన్నోవా వాహనాన్ని తీసుకెళ్లాడు. తాము తిరుపతికి వెళ్తున్నామని చెప్పినా కూడా విన్పించుకోకుండా సీఎం పర్యటనకు వాహనం తీసుకెళ్తున్నామని తీసుకెళ్లారని శ్రీనివాస్ కుటుంబం తెలిపింది. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో తీవ్ర దుమారం రేగింది.
వాహనం లేకపోవడంతో శ్రీనివాస్ కుటుంబం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లోనే రాత్రంతా ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు వినుకొండలోని తమకు తెలిసిన వారికి పోన్ చేసి మరో వాహనాన్ని తెప్పించుకొన్నారు. ఈ వాహనంలో తిరుపతికి వెళ్లారు. ఇలా సీఎం పర్యటన పేరిట కాన్వాయ్ కోసమంటూ ప్రైవేట్ వాహనాలకు బలవంతంగా లాక్కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డాయి.