‘‘ముందస్తు’’ కోసం జగన్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారు.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీ రెడీ : అచ్చెన్నాయుడు

Siva Kodati |  
Published : Jul 06, 2023, 08:26 PM IST
‘‘ముందస్తు’’ కోసం జగన్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారు.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీ రెడీ : అచ్చెన్నాయుడు

సారాంశం

ఏపీలో త్వరగా ఎన్నికలు వచ్చేలా చూడాలని జగన్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.  ఆయన గ్రాఫ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో త్వరగా ఎన్నికలు వచ్చేలా చూడాలని జగన్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సిద్ధమేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలన్నాక పొత్తులు సహాజమేనని.. గతంలో 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. 

జగన్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి సొంత సామాజిక వర్గంలోనూ జగన్‌పై వ్యతిరేకత వుందని.. ఆయన గ్రాఫ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని, చంద్రబాబే సీఎం అవుతారని పలు సర్వేలు చెబుతున్నాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ అంటే అమరావతి , పోలవరమని కానీ జగన్ ఈ రెండింటిని దెబ్బతీశారని..  పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం నిండా ముంచేశారని.. ఇది ఆయన వైఫల్యానికి నిదర్శమని అచ్చెన్న ఎద్దేవా చేశారు.

ALso Read: ‘‘ముందస్తు’’ ప్రచారం వెనుక చంద్రబాబు.. చివరి రోజు వరకు పాలనలోనే : తేల్చేసిన సజ్జల

మరోవైపు.. ముందస్తు ఎన్నికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకు అధికారంలోనే వుంటామని సజ్జల తెలిపారు. ప్రజల్ని అయోమయానికి గురిచేయొద్దని ఆయన కోరారు.  ఈసారి మా ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బ్యాంక్ వస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, పాలన తీరు వైసీపీని మరోసారి అధికారంలోకి తెస్తాయన్నారు. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా ముందస్తు ఎన్నికలు రావని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

ముందస్తు ఎన్నికలు అనేది చంద్రబాబు గేమ్ ప్లాన్ అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్లు రావొద్దని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు ఆలస్యమైనా , రాష్ట్ర వాటా నుంచి పనులు ప్రారంభిస్తామని సజ్జల స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులు ఎందుకు వద్దంటాయని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. షర్మిల ఒక పార్టీ పెట్టుకున్నాక, ఆమె నిర్ణయాలు ఆమెకుంటాయని, వైసీపీగా మా నిర్ణయాలు మాకుంటాయని ఆయన పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu