భయంభయంగానే రోడ్లపైకి... ప్రాణాలపై ఆశలు వదులుకునే బయటకు: అచ్చెన్న సంచలనం

By Arun Kumar PFirst Published Jul 15, 2021, 3:07 PM IST
Highlights

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రోడ్డెక్కాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. 

అమరావతి: రాష్ట్రంలోని రోడ్లపై ప్రయాణం చేస్తే గమ్యం చేరతామో లేదో గానీ... గతించడం తధ్యమనే పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల మరమ్మతులు లేకపోవడం, కొత్తగా రోడ్లు వేయాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు. 

''రాత్రి పూట ప్రయాణమంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ ఏ గుంత ఉందో.. ఎక్కడ ఏ బ్రిడ్జి ఊచలు బయటకొచ్చాయో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామీణ, పట్టణ రోడ్లతో పాటు రాష్ట్ర పరిధిలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు నిత్యం తిరిగే రోడ్లలో సైతం అడుగులోతు గుంతలు పడినా వాటికి మోక్షం లేదు. కనీసం మట్టి పోసి అయినా గుంతలు పూడ్చాలనే స్పృహ లేదు. రోడ్లపై మోకాలి లోతు గోతులు ఏర్పడినా.. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. తమ వారికి రాష్ట్ర సంపద దోచిపెట్టాలనే ద్యాసే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై రూపాయి కూడా ఖర్చు చేసింది లేదు'' అని మండిపడ్డారు. 

read more  పోకిరి సినిమాలో బ్రహ్మానందంలా... నిరుద్యోగులకు ముష్టేస్తారా జగన్ రెడ్డి..: లోకేష్ సీరియస్

''రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో.. ప్రభుత్వ పెద్దల అవినీతి, రోడ్ల నిర్మాణాల పేరుతో చేసిన అక్రమాలు క్రమంగా బయటపడుతున్నాయి. ప్రభుత్వ అవినీతికి నిలువెత్తు రూపాలుగా రాష్ట్రంలోని రోడ్లు నిలుస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా అన్నొస్తున్నాడు.. రోజులు మారిపోతున్నాయని ప్రచారం చేసిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక చేసిందేంటి.? అడుగుకో మడుగు.. ఘడియకో అవినీతి తప్ప రెండేళ్లలో సాధించింది ఏమైనా ఉందా.?'' అని ఎద్దేవా చేశారు. 

''తాను అవినీతి మత్తులో తేలుతూ... ప్రజలను రోడ్లపైనే పడవల్లో తిరిగే పరిస్థితి కల్పించారు. తాడేపల్లి బాలింత... ఇక ఏసీ గదుల్లో పబ్జీ ఆడటం మాని రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని చూడాలి. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించకుండా ప్రచార ఆర్భాటాలకు పోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలోని రోడ్లపై కనిపించే ఒక్కో గుంత.. అధికార పార్టీ నేతల అవినీతికి నిలువుటద్దం. జరిగే ప్రతి రోడ్డు ప్రమాదానికి ప్రభుత్వమే కారణం. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు వెంటనే బడ్జెట్ విడుదల చేయాలి. ఇప్పటి వరకు చేసిన ఖర్చులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

click me!