రేవంత్ వ్యాఖ్యలపై నోరెత్తటానికే భయపడుతున్నారా?

First Published Oct 19, 2017, 2:52 PM IST
Highlights
  • రేవంత్ గురించి మాట్లాడాలంటేనే మంత్రులు, కీలక నేతలు భయపడిపోతున్నారు.
  • రేవంత్ గురించి ఏమట్లాడితే ఎవరి కొంపలంటుకుంటాయో అన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
  • వెలగపూడిలో మంత్రులు, కీలక నేతలను మీడియా కలిసినపుడు రేవంత్ ప్రస్తావించగానే నోళ్ళు మూతపడిపోతున్నాయ్.

రేవంత్ గురించి మాట్లాడాలంటేనే మంత్రులు, కీలక నేతలు భయపడిపోతున్నారు. రేవంత్ గురించి ఏమట్లాడితే ఎవరి కొంపలంటుకుంటాయో అన్న భయం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. వెలగపూడిలో మంత్రులు, కీలక నేతలను మీడియా కలిసినపుడు రేవంత్ ప్రస్తావించగానే నోళ్ళు మూతపడిపోతున్నాయ్. బుధవారం హైదరాబాద్ లో రేవంత్ మాట్లాడుతూ, యనమలకు రూ. 2 వేల కోట్ల కాంట్రాక్టులు, పయ్యావుల, పరిటాల సునీతలకు బీర ఫ్యాక్టరీలకు అనుమతులను కెసిఆర్ ఇచ్చారంటూ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది.

ఏపిలో మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఉంటూనే కెసిఆర్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. రేవంత్ చేసిన కామెంట్లపై ఏ విధంగా స్పందించాలో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. స్పందించాల్సిన చంద్రబాబునాయుడేమో అమెరికా పర్యటనలో ఉన్నారు. యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబుతో పాటే అమెరికాలో ఉన్నారు. దాంతో వారిద్దరి స్పందన ఏంటో తెలీలేదు.

పోనీ రాష్ట్రంలోనే ఉన్న పయ్యావుల, పరిటాల అన్నా మాట్లాడారా అంటే, వారూ మాట్లాడటం లేదు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తే మళ్ళీ ఇంకేం మాట్లాడుతాడో అన్న భయం వారిని నోరిప్పనీయటం లేదు.

ఏపిలోని మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిల్లో పలువురికి హైదరాబాద్ తో విడదీయరాని అనుబంధముందన్న విషయం అందరికీ తెలిసిందే.  వ్యాపారాలు చేసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే, కెసిఆర్-చంద్రబాబు మధ్య ఉన్న వైరం తెలిసిన టిడిపి నేతలెవరు కూడా కెసిఆర్ తో సంబంధాలు పెట్టుకోవటానికి ఇష్టపడరు.

అటువంటిది పలువురు ఏపి టిడిపి నేతలు కెసిఆర్ తో టచ్ లో ఉంటూ ఆర్ధికలబ్ది పొందుతున్నారన్న విషయం నిజంగా సంచలనమే. అందులోనూ టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ చెప్పటమంటే దానికి తిరుగేముంది? మరి, ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలుసో తెలీదో ?  అదేఇపుడు అందరినీ ఇరకాటంలో పడేస్తోంది.

గురువారం మంత్రులు నారా లోకేష్ , దేవినేని ఉమామహేశ్వరరావులు రేవంత్ వ్యవహారంపై మాట్లాడటానికి ఇష్టపడలేదు. ‘అంతా అదిష్టానమే చూసుకుంటుంది తమకేం సంబంధం లేదం’టూ తప్పించుకున్నారు. లోకేషే మాట్లాడటానికి ఇష్టపడకపోతే ఇంకెవరు సాహసం చేస్తారు? అమెరికా నుండి ఆదేశాలు వచ్చే వరకూ అంతే సంగతులు.

 

 

click me!