
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగనున్నాయనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా టీడీపీ, జనసేనల నుంచి కూడా కొంతమేర సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ఇరువైపుల నుంచి ఎటువంటి స్పష్టత లభించడం లేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనే దానిపై సందిగ్దత కూడా నెలకొంది. ఇలాంటి సందర్భంలో టీడీపీ ముఖ్య నేతలు కొందరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందుకు టీడీపీ సభ్యులు.. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పొత్తులు అనేవి ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం అనేది కొత్త విషయం కాదని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పోరాడే పరిస్థితి కూడా లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో పవన్ ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని తాము కోరుతున్నామని చెప్పారు. పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. జనసేన ఆవిర్భావ సభకు అడ్డంకులు సృష్టించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనపైనే టీడీపీ, జనసేన పోరాటం అని చెప్పారు. పొత్తుల అంశాన్ని ఎన్నికల వేళ పార్టీలు చూసుకుంటాయని అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు.