పంట నష్టమయ్యేది ఏనుగుల మంద వల్ల.. చీమల మేతతో కాదు: జగన్‌పై కళా వెంకట్రావు సెటైర్లు

Siva Kodati |  
Published : Aug 25, 2020, 06:02 PM IST
పంట నష్టమయ్యేది ఏనుగుల మంద వల్ల.. చీమల మేతతో కాదు: జగన్‌పై కళా వెంకట్రావు సెటైర్లు

సారాంశం

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన చిరు ఉద్యోగుల లంచాలపై జగన్‌రెడ్డి కఠిన చట్టం చేస్తానని చెబుతున్నారని, మరి వైసీపీ నేతల కుంభకోణాలపై చట్టం ఎందుకు చేయరని ప్రశ్నించారు.

పంట పొలాలపై పడ్డ ఏనుగుల మంద వల్ల పంట ధ్వంసమౌతుందా? చీమల మేత వల్లనా అని కళా వెంకట్రావు నిలదీశారు.  15 నెలల జగన్‌రెడ్డి పాలనలో కుంభకోణాలు హద్దు మీరాయని.. ప్రజల్లో నేతల అవినీతిపై బాగా వ్యతిరేకత పెరుగుతోందని ఆరోపించారు.  

దీన్ని కప్పిపుచ్చుకోవడానికే లంచాల చట్టం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని ఆయన మండిపడ్డారు. అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి జగన్‌రెడ్డికి వుంటే ముందుగా క్రింది చర్యలు చేపట్టాలని సూచించారు. 

1. నాసిరకం మద్యం బ్రాండ్లకు అనుమతి మంజూరు చేసి దానివల్ల ఏడాదికి రూ.5 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు మద్యం ముడుపులు నేరుగా జగన్‌రెడ్డికి చేరుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు - ఇదే నిజం కాకపోతే నాసిరకం మద్యం బ్రాండ్లను రద్దు చేయాలి - పెంచిన మద్యం రేట్లు తగ్గించాలి - పేరెన్నికగన్న నాణ్యమైన బ్రాండ్లకే పరిమితం కావాలి - ఇది చేస్తారా?
2.కుంటి సాకులతో సీబీఐ విచారణకు గైర్హాజరు కాకుండా విచారణకు హాజరై రూ.43 వేల కోట్లు అవినీతి చేయలేదని రుజువు చేసుకోవాలి.
3.ఇళ్ల పట్టాల కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డట్టు ప్రాథమిక ఆధారాలు బహిరంగమైనచోట వైసీపీ నేతలపై ముందుగా చర్యలు తీసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లా ఆవ భూముల్లో రూ.400 కోట్ల అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇతర నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ పేరుతో లెవలింగ్ ముసుగులో అవకతవకలకు పాల్పడిన వాళ్లందరినీ శిక్షించాలి.
4.ఇసుక కుంభకోణాలకు పాల్పడుతున్న నేతల ఆటకట్టించాలంటే తిరిగి ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టాలి.
5. అంబులెన్సులు వేళకు రావు - అంబులెన్సుల కుంభకోణంలో రూ.307 కోట్లు అవినీతికి పాల్పడ్డ విజయసాయిరెడ్డిపై రాజకీయ చర్యలు తీసుకోవాలి.
6. కరోనా కిట్ల కుంభకోణానికి ప్రయత్నించిన వారిపైన చర్యలు తీసుకోవాలి.
7. కోవిడ్‌ యాప్‌ రూపకర్తల్లో ఒకరైన విశాఖవాసి లలితేజ్‌ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై పోలీసు కేసు పెట్టాలి.
8. విశాఖలో ప్రభుత్వ భూములు దురాక్రమణ చేసి ఆ భూముల్ని తక్కువ ధరతో కొట్టెయ్యడానికి ఫైల్‌ కదుపుతున్న రాంకీ సంస్థపై కేసు పెట్టగరా?
9. లాటరైట్‌ గనులు దోపిడీ చేస్తున్న వైసీపీ నేతలపై కేసులు పెట్టగలరా?
10. రూ.1,600 కోట్ల విలువైన గనులను సీయం కుటుంబ సభ్యులు భాగస్వాములుగా వున్న సరస్వతి సిమెంట్‌ ఫ్యాక్టరీకి కేటాయించడం ఘరానా అవినీతి, అధికార దుర్వినియోగం కాదా?
11. పత్రికన్నింటికీ ఇచ్చిన ప్రభుత్వ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ రూ.100 కోట్లు కాగా, అందులో సాక్షి పత్రిక ఒక్కదానికే రూ.50 కోట్లు ఇవ్వడం అవినీతి, అధికార దుర్వినియోగం కాదా?
12. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌లో జరుగుతున్న భారీ కుంభకోణాలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపెట్టుకోవడానికే లంచాల చట్టం డ్రామా కాదా? ఇది ఏనుగుల మేతను మరుగుపరచడానికి చీమల మేతపైన యాగీ చేయడం కాదా? జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి వుంటే కుంభకోణాలపై మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ సంఘం వేయాలి.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu