కేఆర్ మూర్తి రాజీనామా: వైఎస్ జగన్ కు కొత్త చిక్కులు

By telugu teamFirst Published Aug 25, 2020, 4:24 PM IST
Highlights

ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రముఖ జర్నలిస్టు కె. రామచంద్ర మూర్తి చేసిన రాజీనామా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఆయన రాజీనామా విషయంలో జరుగుతున్న చర్చనే అందుకు ఉదాహరణ.

అమరావతి: ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రముఖ జర్నలిస్టు కె. రామచంద్ర మూర్తి రాజీనామా చేయడం వల్ల కొత్త కోణాలు వెలుగు చూస్తన్నాయి. ఆయనను వైఎస్ జగన్ పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించారు. క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. వేతనం కూడా లక్షల్లోనే ఉంటుంది. అయితే, ఆయన రాజీనామా చేయడం వెనక కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వ విధానాల రూపకల్పన కోసం నిర్వహించిన సమావేశాలకు ఆయనను ఆహ్వానించలేదని తెలుస్తోంది. కేవలం పదవి ఆయనకు అలంకారప్రాయంగా మాత్రమే మిగిలినట్లు చెబుతున్నారు. దాంతో ఆయన తాను చేసేదేమీ లేనప్పుడు పదవిలో కొనసాగడం ఎందుకని చెప్పి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. 

పదవికి రాజీనామా చేసినందుకు సీపీఐ రాష్ట్ర కార్యదార్శి రామకృష్ణ కేఆర్ మూర్తిని అభినందించారు. వామపక్ష భావాలు గల కేఆర్ మూర్తి పట్ల కమ్యూనిస్టు పార్టీలు సానుకూలంగా వ్యవహరించడమనేది ఉంది. కానీ రామకృష్ణ లేవనెత్తిన అంశాలు కూడా చర్చకు దారి తీసే అవకాశం కల్పిస్తున్నాయి. 

జగన్ ప్రభుత్వంలో సలహాదారులంతా అలంకారంగానే మిగిలారని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గత 14 నెలల కాలంలో సలహాదారుల నుంచి ఒక్క సలహా కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. వ్యక్తిత్వం ఉన్నవాళ్లెవరు కూడా జగన్ పాలనలో సలహాదారులుగా కొనసాగలేరని ఆయన అన్నారు. ప్రజాధనం వృధా చేయకుండా తక్షణమే మిగిలిన సలహాదారులు రాజీనామా చేయాలని ఆయన సూచించారు. 

కేఆర్ మూర్తి రాజీనామా నేపథ్యంలో రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది వైఎస్ జగన్ కు కొత్త చిక్కులు తెచ్చే పెట్టే అవకాశం ఉంది.

click me!