రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే ఏపి సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని వదిలి భయటకు రావడంలేదంటూ ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు.
గుంటూరు: కరోనా నివారణకు కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో 7 పదుల వయసున్న ముఖ్యమంత్రులే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తుంటే నాలుగు పదుల వయసున్న జగన్ మోహన్ రెడ్డి నాలుగు అడుగులు కదల్లేని స్థితిలో ఉన్నారని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్ ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదు..ఆయన రాష్ట్ర నికి ముఖ్యమంత్రా లేక తాడేపల్లి కి ముఖ్యమంత్రా? ప్రజలకు ముఖ్యమంత్రా? ప్యాలెస్ కి ముఖ్యమంత్రా? అంటూ కళా ఎద్దేవా చేశారు.
''ఇంట్లో దొంగలు పడితే..ఇంటి ఓనర్ ఇళయరాజా సంగీతం వింటూ పడుకున్నట్లు రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే జగన్ మాత్రం ఏమీ పట్ట నట్లు ఇంట్లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి కరోనాకి భయపడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి పబ్జీ గేమ్ పై ఉన్న ఆసక్తి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరం'' అని మండిపడ్డారు.
undefined
''కరోనా నివారణలో వైసీపీ పని తీరును చూసి జనం తిరగబడతారేమోనని బయటకు రాలేకపోతున్నారా? ఇప్పటికే తుగ్లక్ చర్యలకు దాదాపు 55 సార్లు న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినందుకు ప్రజలకు ముఖాన్ని చూపించలేకపోతున్నారా? పేరాసిట్మాల్, బ్లీ చింగ్ పౌడర్ తో పోయేదానికి తనంత మహిమాన్వితుడు బయటకు రావడం దేనికి అని అనుకుంటున్నారా?'' ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.
''చంద్రబాబు నాయుడు కరోనాపై ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల కోసం రాజ్యాంగ ఉల్లంఘనలకు వెనకాడం లేదు. కోర్టులు ఆక్షేపిస్తున్నా అదే తోవలో ప్రయాణించాలని చూడటం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం'' అని అన్నారు.
''కరోనా విపత్తు సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి వంటి వారు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. బాధితులు, వలస కార్మికులు, రైతులు ఇతర వర్గాలవారి కష్టసుఖాలను నేరుగా తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాగాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు'' అని విమర్శించారు.
''ఘోరకలి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చలించకపోవడం తన అసమర్ధతను బయట పెడుతుంది. కరోనా కట్టడి చర్యలను గాలికొదిలేసి రాజకీయ, సామాజిక ప్రత్యర్థులను హింసించడం ఘోరం. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలి. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి'' అని సూచించారు.
''చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నా ఒకటే... జగన్ తాడేపల్లిలో తల దాచుకున్నా ఒక్కటే. ప్రజలకు భరోసా నింపాల్సిన జగన్ ఇంటికే పరిమితం అయ్యారు. కాని చంద్రబాబు ప్రతి రోజూ కరోనా నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలను మేధావులు, డాక్టర్లతో చర్చించి ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. దేశ, విదేశాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్రం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు లేఖలు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలియ జేస్తూనే ఉన్నారు'' అని తెలిపారు.
''వైకాపా నాయకులు దాన్ని రాజకీయానికి వాడుకోవడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రజల బాగోగుల కోసం పరితపిస్తుంటే జగన్ మాత్రం ఎన్నికల కోసం రాజ్యాంగ ఉల్లంఘనలు, కోర్ట్ ధిక్కారానికి దిగటం దౌర్భాగ్యం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజులు క్వారంటైంలో ఉండాలి. అలాంటి నిబంధనలు విజయసాయిరెడ్డి, మంత్రులకు పట్టవా?'' అని కళా వెంకట్రావు నిలదీశారు.