ఢిల్లీలో మద్దతు-గల్లీలో జగన్నాటకాలు... కేసుల మాఫీ కోసమే: జగన్ పై అచ్చెన్న ఆగ్రహం

By Arun Kumar PFirst Published Dec 8, 2020, 4:21 PM IST
Highlights

టీడీపీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రైతుల పక్షానే పోరాడుతోందని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. 

గుంటూరు: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండానే పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఏకపక్షంగా మద్దతు తెలిపారని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆనాడు బీజేపీ ఎంపీల కంటే ఎక్కువగా వ్యవసాయ బిల్లులను వైసిపి ఎంపీలే సమర్థించారని అన్నారు. కేవలం కేసుల మాఫీ కోసం రైతుల ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టారని అచ్చెన్న ఆరోపించారు.

''ఢిల్లీలో మద్దతు-గల్లీలో జగన్నాటకాలు ఎవరిని మోసం చేయడానికి? తెలుగుదేశం పార్టీ ఆనాడు బిల్లును సమర్ధిస్తూనే సవరణలు ప్రతిపాదించింది. తెలుగుదేశం ఆ సవరణలనే నేటికీ కోరుతోంది. కానీ సవరణలు కోరే వారిపై ఆనాడు విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు నిందలు వేశారు. ఇవాళ జే-టర్న్ తీసుకుని వంకర టింకరగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రైతాంగం వైసీపీ కపట నాటకాన్ని గమనించదని భ్రమ పడుతున్నారు'' అన్నారు.

''టీడీపీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రైతుల పక్షానే పోరాడుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధిరేటు సాధించి ఆదర్శంగా నిలవడం జరిగింది. అన్ని విధాల వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాం. నేడు వైసీపీ సున్నావడ్డీలోనూ, పంటల బీమాలోనూ, పంట నష్టపరిహారం చెల్లించడంలోనూ రైతులను మోసం చేసింది. ఇరిగేషన్, వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో తక్కువగా నిధులు కేటాయించారు. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల భూములను లాక్కున్నారు. రైతు ద్రోహిగా మారిన వైసీపీ.. వారి రైతాంగ వ్యతిరేక చర్యల నుంచి దృష్టి మరల్చేందుకు టీడీపీపై నిందలు వేస్తున్నారు'' అని విమర్శించారు.

read more  భారత్ బంద్: రైతులకు మద్దతుగా ఏపీలో పలు చోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు

''వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి తమ విధానాలతో బహిరంగ ప్రకటన చేయాలి. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలు మార్చుకోవాలి. ఇటీవల నివార్ తుఫాను సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల కార్చిన మొసలికన్నీరు నిదర్శనం. పంట బీమా కట్టకుండా కట్టానని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పి.. రాత్రికి రాత్రి రూ.590 కోట్లు చెల్లించి, రైతులను మోసం చేశాడు. ఆరుగాలం ఎండనక, వాననక శ్రమించే రైతుకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది'' అని అన్నారు.

''కనీస మద్దతు ధర(MSP)అనేది హామీగా కాకుండా చట్టబద్దమైన హక్కుగా ఉన్నప్పుడే రైతుల ప్రయోజనాలకు భద్రత కలుగుతుంది. మార్కెట్ యార్డులను కొనసాగించి వాటిని పటిష్టం చేస్తేనే రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే అవసరమైన సమయంలో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉండాలి. వ్యవసాయ చట్టాలకు రాజ్యసభలో తెలుగుదేశం పక్షనేత పై సవరణలు ప్రతిపాదించారు. ఇవి మరోమారు ప్రతిపాదిస్తున్నాం. ఈ బిల్లుల ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎవరికి అమ్మాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ కొరవడే అవకాశం ఉంది. ఏపీఎంసీల్లో లోటుపాట్లుంటే సవరించాలే కానీ.. నిర్వీర్యం చేయడం సరికాదు'' అని సూచించారు.

''మరోవైపు చిన్న, సన్నకారు రైతుల పంటల కొనుగోలుకు రక్షణకు సంబంధించి బిల్లులో ఉన్న నిబంధనలు అస్పష్టంగా ఉన్నవి. రైతు ఆత్మహత్యలను నివారించాలంటే వారికి భరోసా కల్పించాలి. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉన్నది. రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పంట నష్ట పరిహారం, పంట బీమా, మద్దతు ధర కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. మరోవైపు వ్యవసాయ చట్టాలకు ఎలాంటి సవరణలు ప్రదిపాదించకుండా ఆమోదించారు. దీన్ని మరుగుపరచడానికి సవరణలు ప్రతిపాదించిన తెలుగుదేశంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. రైతుకు గిట్టుబాటు ధర దక్కాలి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీపడే ప్రసక్తే లేదు'' అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

click me!