
ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే.. రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమౌతాయి. ఎలాంటి కార్యచరణతో ముందుకు వెళ్లాలి? ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి? ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు ప్రయోజనం కలుగుతుంది? ఇలాంటి ఆలోచనలతో ముందడుగు వేస్తుంటాయి. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు ఈ విషయాల్లో క్లారిటీతోనే ఉన్నాయి.. ఒక్క బీజేపీ తప్ప.
2019 అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. అయితే.. బీజేపీ నేతలు మాత్రం అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామా, పొత్తుతో ముందుకు వెళతామో తెలియక గందరోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. గడిచిన మూడున్నర సంవత్సర కాలంలో తమకు దక్కాల్సిన ప్రాధాన్యత చంద్రబాబు ఇవ్వడంలేదనే అక్కసుతో ఉన్నారు బీజేపీ నేతలు. అందుకే టీడీపీతో పొత్తుకు రాష్ట్ర నేతలు ససేమిరా అంటున్నారు. కానీ అధిష్టానం తీరు చూస్తేంటే మరోలా ఉంది. తమ మనసులో మాట బయటపెట్టకుండా.. బీజేపీ నేతలను మరింత గందరగోళానికి గురిచేస్తోంది.
రెండు రోజుల క్రితం గుంటూరులో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని రాష్ట్ర బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టేలా మాట్లాడారు. గడచిన మూడున్నరేళ్ళల్లో చంద్రబాబునాయుడు ఏనాడూ భాజపా నేతలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. మిత్రపక్షమే అయినా అందరు నేతలకూ కనీస మర్యాద కూడా టిడిపి ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు.
అడుగడుగునా అవమానిస్తున్న టిడిపితో ఇంకా ఎందుకు కలిసుండాలంటూ పలువురు నేతలు రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును నిలదీసారట. కేంద్రపథకాల అమలులో అవినీతి జరుగుతున్నా కనీసం అడిగేందుకు కూడా లేకుండా నోళ్ళు కట్టేస్తున్నారంటూ పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారట.
కాబట్టి, వచ్చే ఎన్నికల వరకూ వేచివుండకుండా ఇప్పటి నుండే ఒంటరిపోరుకు సిద్దపడాలంటూ నేతలు గట్టిగా పట్టుబట్టారట. వచ్చే ఎన్నికలకు ముందు భాజపాతో పొత్తును చంద్రబాబే తెంచుకుంటే అప్పుడు మనం ఏ విధంగా జనాల్లోకి వెళ్ళగలమంటూ పలువురు నేతలు రాష్ట్ర అధ్యక్షుడిని ప్రశ్నించారట. పార్టీ బలమెంతో తెలియాలంటే ఒంటరిగా పోటీ చేయాల్సిందే అంటూ మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారట.
వారు తమ బాధను అంతలా వెళ్లగక్కుకున్నా... పార్టీ జాతీయ నాయకత్వం నోరు విప్పకపోవడం గమనార్హం. బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. దీంతో కమలనాథులు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు.