ఏపీ రాజధాని తరలింపు కేసులో అనూహ్యమైన ట్విస్ట్

By telugu teamFirst Published Jul 28, 2020, 5:56 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు కేసులో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. హైకోర్టులో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇంప్డీడ్ పిటిషన్ దాఖలు చేసింది. రాజధాని అనేది రైతుల వ్యవహారం కాదని సంఘం తన పిటిషన్ లో అన్నది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపు కేసులో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. రాజధాని తరలింపు కేసులో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర రాజధాని అనేది భూములు ఇచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు అని వారు తమ పిటిషన్ లో అన్నారు. 

రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రభుత్వమే కానీ రైతులు కాదని అన్నరు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూకేటాయింపులు జరిగాయని, అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతోందని అన్నారు. 

అమరావతి ప్రాంతంలో రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయని అనడం పూర్తిగా అబద్ధమని అన్నారు. కొందరు రాజకీయ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే పిటిషన్ వేశారని వారన్నారు. ఇందులో ఏ విధమైన ప్రజా ప్రయోజనాలు లేవని అన్నారు. 

అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని, రాజధాని తరలింపునకు అయ్యే ఖర్చు 70 కోట్లు మాత్రమేనని, రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం కూడా వ్యతిరేకించలేదని ఏపి సచివాలయం సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తన పిటిషన్ లో వివరించారు. 

అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా మాత్రమే కొనసాగిస్తూ విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కోర్టులో పిటిషన్ వేసింది.

click me!