రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గవర్నర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని చెప్పారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సమస్యల విషయంలో ప్రభుత్వానికి, మీకు వారధిగా ఉంటానని గవర్నర్ హామీ ఇచ్చారని నిమ్మగడ్డ వెల్లడించారు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గవర్నర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని చెప్పారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సమస్యల విషయంలో ప్రభుత్వానికి, మీకు వారధిగా ఉంటానని గవర్నర్ హామీ ఇచ్చారని నిమ్మగడ్డ వెల్లడించారు.
ఎన్నికల కమీషనర్ సుప్రీంకోర్టు వ్యక్తిగతంగా, వ్యవస్థాపరంగా సమర్ధించిందని ఎస్ఈసీ తెలిపారు. ఈ ఎన్నికలు ఎలా జరగాలి, ఉద్యోగులు, ప్రభుత్వ పాత్ర ఏంటనే దానిపై నిర్మాణాత్మక సూచనలు చేసిందని ఆయన గుర్తుచేశారు.
వాటిని ఒక పాజిటివ్ ధృక్పథంతో స్వీకరించాలని ఆయన కోరారు. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌లతో తనకు వ్యక్తిగతంగా సత్సంబంధాలు వున్నాయని రమేశ్ కుమార్ తెలిపారు.
తాము చక్కని సమన్వయంతో అన్ని పనులు నిర్వర్తించుకోగలగమని.. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వారు చక్కని నిర్ణయాలు తీసుకున్నారని ఎస్ఈసీ ప్రశంసించారు. తనకు అధికారులతో ఎలాంటి సమస్యలు, గొడవలు లేవని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని నిమ్మగడ్డ వెల్లడించారు.
ఇవాళ సీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం జరిగిందని.. ప్రభుత్వం యంత్రాంగం ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తోందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని రమేశ్ కుమార్ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఎన్నికల కమీషనర్‌ను వ్యక్తిగతంగా దూషించడం తగదన్నారు.
ఇకనైనా ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటించి .. ఎన్నికల కమీషన్ ప్రతిష్టను పెంచాలని ఎస్ఈసీ సూచించారు. ఇద్దరు అధికారులపై తాను తీసుకున్న చర్యల గురించి ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుచితమని.. ఇది సుప్రీంకోర్టు తీర్పుకి, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైనదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
ఇద్దరు అధికారుల గురించి మీరు మాట్లాడితే .. లక్షలాది మంది యువత ఓటుహక్కు గురించి తాను బాధ్యత తీసుకున్నానని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
తాను ఆ ఇద్దరు అధికారుల బదిలీ కోరలేదని, క్రమశిక్షణా చర్యలు చెప్పలేదని.. వారు విధులు సక్రమంగా నిర్వర్తిస్తే పునరాలోచిస్తామని నిమ్మగడ్డ వెల్లడించారు. తనకు ఎవరిమీదా కక్షలేదని.. తాను ఏ సర్వీస్ మూలాల నుంచి వచ్చిందని మరిచిపోలేదని ఆయన స్పష్టం చేశారు.