జగన్ ప్రభుత్వంపై పోరు: హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్

By telugu teamFirst Published Sep 3, 2020, 8:27 AM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి న్యాయపోరాటానికి దిగారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రను దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆయన ఆ పిటిషన్ లో విమర్శించారు. 

ఈసీ నుంచి సీఐడి అధికారులు తీసుకుని వెళ్లిన వస్తువులను తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు. హోం శాఖ కార్యదర్శిని, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని, సిఐడిని, డీజీపీని, తదితరులను తన పిటిషన్ లో రమేష్ కుమార్ ప్రతివాదులుగా చేర్చారు. 

ఎస్ఈసీ స్వతంత్రను దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని రమేష్ కుమార్ అన్నారు. తమ సిబ్బందిపై సీఐడి నమోదు చేసిన కేసును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని, ఈ వ్యవహారంపై సిబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కోరారు. 

ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి వాడిన కంప్యూటర్ ను, అందులోని డేటాను సిఐడి అధికారులు తీసుకుని వెళ్లారని ఆయన ఆరోపించారు. గతంలో తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు వచ్చిన సిఐడి అధికారులు ఆ విషయాన్ని పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారని ఆయన ఆరోపించారు.

పనిచేయని కంప్యూటర్ ను ఫార్మాట్ చేసినందుకు సాంబమూర్తిని సిఐడి అధికారులు వేధించడమే కాకుండా సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఆయనపై తప్పు కేసు బనాయించారని రమేష్ కుమార్ అన్నారు 

ఎన్నికల సిబ్బందిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఎన్నికల సంఘం సహాయ కార్యదర్శి సాంబమూర్తి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.

ఆర్డినెన్స్ ను జారీ చేసి గతంలో జగన్ ప్రభుత్వం ఈసీ పదవి నుంచి రమేష్ కుమార్ ను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. దాంతో కోర్టుల ద్వారా ఆదేశాలు పొంది రమేష్ కుమార్ ఈసీ పదవిని చేపట్టారు. ఈసీ పదవిని చేపట్టిన తర్వాత తాజాగా హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

click me!