ఏకగ్రీవాలు పెంచాలన్న ప్రభుత్వం... కౌంటరిచ్చిన నిమ్మగడ్డ

By Siva KodatiFirst Published Jan 27, 2021, 6:51 PM IST
Highlights

ఏకగ్రీవాలకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు తన దృష్టికి తీసుకొచ్చాయని.. దీనికి ప్రొత్సాహకాలు పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇలాంటి ప్రకటనలపై రాజకీయ పార్టీలు భయాందోళనలకు గురువుతున్నాయని.. ఏకగ్రీవాలపై ఎస్ఈసీ సలహా లేకుండానే పేపర్ ప్రకటన ఇచ్చారని నిమ్మగడ్డ మండిపడ్డారు.

ఏకగ్రీవాలకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు తన దృష్టికి తీసుకొచ్చాయని.. దీనికి ప్రొత్సాహకాలు పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇలాంటి ప్రకటనలపై రాజకీయ పార్టీలు భయాందోళనలకు గురువుతున్నాయని.. ఏకగ్రీవాలపై ఎస్ఈసీ సలహా లేకుండానే పేపర్ ప్రకటన ఇచ్చారని నిమ్మగడ్డ మండిపడ్డారు.

ప్రకటనపై సంబంధిత అధికారులను సంజాయిషీ కోరానని చెప్పారు. ఏకగ్రీవాలపై అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. చాలా గ్రామాల్లో మంచివాళ్లని, పెద్ద వాళ్లని గ్రామ నాయకత్వం తీసుకోవాలని గ్రామమంతా ఏకాభిప్రాయంతో కోరుతుందని, కానీ దానికి పరిమితి దాటకూడదని నిమ్మగడ్డ హెచ్చరించారు.

ఔత్సాహికులు ఎన్నికల్లో పాల్గొనాలని ముందుకు వస్తే.. వారికి అండగా నిలబడాల్సిన అవసరం వ్యవస్థకు వుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ హెచ్చరించారు.

ఏకగ్రీవాలు జరిగినా వాటిని పరిశీలించాల్సిందిగా అధికారులను కోరామని నిమ్మగడ్డ వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై కమీషన్ విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగుతాయని నిమ్మగడ్డ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే .. అలాంటి వాటిని తప్పనిసరిగా న్యాయవ్యవస్థ ముందుకు తీసుకెళ్తానని ఎస్ఈసీ వెల్లడించారు. 

తనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు వుండేదని.. కానీ దానిని తాను సరెండర్ చేశానని, తన స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నానని ఎస్ఈసీ తెలిపారు. తనకు గ్రామంలో ఇళ్లు, పొలం , ఇతర ఆస్తులు వున్నాయని నిమ్మగడ్డ వెల్లడించారు.

హైదరాబాద్‌లో క్యాంప్ ఆఫీసు వున్నప్పటికీ... మార్చి 31 తర్వాత తాను దుగ్గిరాలకే రావాల్సి వుందన్నారు. తాను దుగ్గిరాలలో సాధారణంగా ఉండటం లేదని తాను ఓటు హక్కు కోసం పెట్టుకున్న దరఖాస్తును స్థానిక తహసీల్దార్ తిరస్కరించారని నిమ్మగడ్డ వెల్లడించారు.

ఎలక్షన్ కమీషనర్‌గా నాకు విచక్షణాధికారాలు వున్నట్లే.. ఏ అధికారికైనా వుంటాయని వాటిని తాను గౌరవిస్తానని ఎస్ఈసీ తెలిపారు. తన ఓటు హక్కును తిరస్కరించిన అధికారులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలకు దిగలేదని.. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఆర్జీ పెట్టుకుంటానని, అక్కడా అన్యాయం జరిగితే కోర్టుకు వెళతానని నిమ్మగడ్డ తెలిపారు.

ఉద్యోగ సంఘాలు కూడా తనపై దురుసుగా వ్యాఖ్యలు చేసినా.. వాటిని పట్టించుకోనని గవర్నర్‌కు తెలిపానని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. కాశీ విశ్వనాథం, రమణయ్య, ప్రసాద్ ఇలాంటి ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి పనిచేశానని.. జాయింట్ స్టాఫ్ మీటింగ్‌ను ఒంటిచేత్తో నడిపించానని నిమ్మగడ్డ గుర్తుచేశారు.

ఈ సంగతి ఈ తరం ఉద్యోగులకు తెలియదని.. పాత తరం ఉద్యోగులందరికీ తెలుసునని ఎస్ఈసీ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో సన్నిహిత సంబంధాలు వున్న అతికొద్ది మంది అధికారుల్లో తానూ ఒక్కడినని చెప్పారు. ఇలాంటి తాను ఉద్యోగులపై వ్యతిరేక ధోరణితో ఉంటానని నిమ్మగడ్డ ప్రశ్నించారు. నేనూ ప్రభుత్వోద్యోగినేనని.. కాకపోతే కొంచెం పెద్దది అంటూ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. 

click me!