మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే ఛాన్స్ .. సీఈవో కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు ఏపీ ప్రధాన ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా . జనవరి 2024 నాటికి మేజర్‌లుగా మారే వ్యక్తులు డిసెంబర్ 9 లోపు ఓటర్ కార్డ్ కోసం దరఖాస్తు చేసువాలని మీనా సూచించారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఓ రేంజ్‌లో జరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జాతీయ నేతలను రంగంలోకి దించాయి. దీంతో ఆరోపణలు , ప్రత్యారోపణలు చేసుకుంటూ వాతావరణాన్ని హాట్ హాట్‌గా మార్చేస్తున్నాయి. ఈ సంగతి పక్కనబెడితే.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ఎప్పుడు అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు ఏపీ ప్రధాన ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోందని చెప్పారు. డిసెంబర్ 9 వరకు ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. 

ఎన్నికల సంఘం డిసెంబర్ 26 వరకు అభ్యంతరాలను పరిశీలించి.. జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తుందని మీనా వెల్లడించారు. ఈసారి 10 లక్షలకు పైగా బోగస్ ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లుగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 4,02,21,450 మంది ఓటర్లు వుండగా.. అందులో 2,03,85,851 మంది మహిళా ఓటర్లు.. 1,98,31,791 మంది పురుష ఓటర్లు వున్నారు. అలాగే 3,808 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కూడా వున్నారు. రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 1031 మంది మహిళా ఓటర్లు వున్నారని సీఈవో పేర్కొన్నారు. 

Latest Videos

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు చోట్లా కొందరికి ఓట్లు ఉన్నందున రాష్ట్రంలో డబుల్ ఓటర్లపై రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని మీనా తెలిపారు. డబుల్ ఓట్లను తనిఖీ చేయడానికి యంత్రాంగం లేదని.. ఆంధ్రప్రదేశ్‌లో జాబితా చేయబడిన ఓట్లను మాత్రమే తనిఖీ చేయడానికి వీలౌతుందని ఆయన చెప్పారు. జనవరి 2024 నాటికి మేజర్‌లుగా మారే వ్యక్తులు డిసెంబర్ 9 లోపు ఓటర్ కార్డ్ కోసం దరఖాస్తు చేసువాలని మీనా సూచించారు. ఈ ఓట్లను పరిగణనలోనికి తీసుకుని 2024 జనవరి 5 న ప్రకటించే తుది ఓటర్ల జాబితాలో చేర్చుతామని ఆయన చెప్పారు. 

2023 జాబితా నుంచి 13,48,203 ఓట్లను తొలగించినట్లు ఆయన తెలిపారు. వీరిలో 6,88,393 మంది మరణించగా.. 5,78,625 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లుగా గుర్తించారు. అలాగే జాబితాలో 81,185 డబుల్ ఎంట్రీలు వున్నాయని.. వాటిని కూడా తొలగించామని చెప్పారు. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని.. వీటి ఖచ్చితత్వం కోసం పరిశీలిస్తున్నామని మీనా తెలిపారు . 

click me!