కాపుల చుట్టూ ఏపీ రాజకీయం: కాపు ఉద్యమానికి జైకొడుతున్న హరిరామజోగయ్య

By team teluguFirst Published Aug 12, 2020, 10:14 AM IST
Highlights

తాజాగా మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య కాపు ఉద్యమాన్ని భుజానికెత్తుకోనున్నట్టు తెలిపాడు. ఆయన కాపు సంక్షేమ సేనను కొత్తగా స్థాపించాడు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సేన పనిచేస్తుందని చెప్పాడు. 

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని ఇక తాను మోయలేనంటూ కాడెత్తేసిన తరువాత..... రాజకీయమంతా కాపుల చుట్టూనే తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. 25 శాతం జనాభాగల ఉన్న కాపులను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు తమ తమ ప్రయత్నాలను ఎప్పటినుండో చేస్తున్నప్పటికీ... కాపులు మూకుమ్మడి వోట్ బ్యాంకు గా మారడంలేదు. 

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యుఎస్ కోటాలో 5 శాతం కాపులకు ఇస్తానని చెబితే..,. జగన్ కాపు నేస్తం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ సైతం కాపుల గొంతుకను అవుతాను అని మాట్లాడుతున్నాడు. 

తాజాగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజయితే... కాపులందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే పనిలో పడ్డాడు. ఇప్పటికే... పవన్ కళ్యాణ్, చిరంజీవిలను కలిసిన సోము వీర్రాజు త్వరలో ముద్రగడ, సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణను సైతం  కలవనున్నట్టుగా తెలుస్తుంది. 

రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను జగన్ సర్కార్ వెల్లువలా వదులుతుండడంతో.... తమకు రిజర్వేషన్ ఉంటే... ఉద్యోగాన్ని దక్కించుకుందుము అన్న భావన కాపు యువతలో ముఖ్యంగా కనబడుతుంది. 

ఇక ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య కాపు ఉద్యమాన్ని భుజానికెత్తుకోనున్నట్టు తెలిపాడు. ఆయన కాపు సంక్షేమ సేనను కొత్తగా స్థాపించాడు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సేన పనిచేస్తుందని అయన చెప్పాడు. 

కాపు ఉద్యమాన్ని ఏ పార్టీ కూడా హైజాక్ చేయకుండా ఉండేందుకు ఇది ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపాడు. కాపు ఉద్యమంలో ఇప్పుడు కొత్త నేత రావడం, అందునా ఆయన మాజీ ఎంపీ అవడం, కాపు నేతగా బాగా ప్రాచుర్యం పొందడం అన్ని వెరసి ఈయన ఇప్పుడు ఈ ఉద్యమాన్ని చేపట్టడంతో కాపు సామాజికవర్గంలో నూతన రాజకీయ సమీకరణలకు తెర తీసేలా ఉంది. 

ముద్రగడ పద్మనాభం స్క్రీన్ మీద లేకపోవడం, పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ... రాజకీయ నాయకుడిగా ఉండడం, సోము వీర్రాజు సైతం బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో.... కేవలం కాపు అజెండాను మాత్రమే భుజానికెత్తుకొని నాయకుడు కరువయ్యాడు. 

ఇప్పుడు చేగొండి ఆ ఖాళీని భర్తీ చేసేలా కనబడుతున్నాడు. మిగితా వారిలా మిగిలిన సామాజికవర్గాల మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఆయనకు లేదు. కాపు ఉద్యమమే ప్రధాన అజెండా గా చేసుకొని ప్రభుత్వం పై పోరాడే యోచనలో ఆయన ఉన్నట్టుగా అర్థమవుతుంది. 

click me!