హిందుపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురు దెబ్బ: కింకర్తవ్యం?

By telugu teamFirst Published Mar 16, 2021, 9:27 AM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ఎదురు దెబ్బ తగిలింది. హిందూపురం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరింది. బాలకృష్ణ మకాం వేసి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో నందమూరి హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోని హిందూపురంలో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి కంచుకోటగా భావించే హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి 51.51 శాతం ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి కేవలం 30.31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హిందూపురంలో టీడీపీ అభ్యర్థుల కోసం బాలకృష్ణ విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. 

2019 శానసశభ ఎన్నికల్లో హిందూపురం పట్టణంలో టీడీపీకి 9,655 ఓట్ల మెజారిటి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో తారుమారై వైసీపీకి 14,647 ఓట్ల మెజారిటీ వచ్చింది. హిందూపురంలో మొత్తం 38 వార్డులు ఉండగా 29 వార్డుల్లో వైసీపీ జెండా ఎగిరింది. టీడీపికి ఆరు స్థానాలు మాత్రమే వచ్చాయి. పది వార్డుల్లో టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. 

హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డుల్లో 78,259 మంది ఓట్లు వేయగా వైసీపికి 40,310 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 23,718 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపికి 3,557 ఓట్లు పోల్ కాగా, ఎంఐఎంకు 4,277 ఓట్లు వచ్చాయి. స్వతంత్రులకు 4,617 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 687ఓటులు పోల్ కాగా, సీపీఐకి 640 ఓట్లు వచ్చాయి. జనసేనకు 388, కాంగ్రెసుకు 38, బీఎస్పీకి 27 ఓట్లు వచ్చాయి. 

మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలోనే మకాం వేసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచార రథం ఎక్కి ర్యాలీలు నిర్వహించారు. అయినా టీడీపీ తగిన ఫలితాలు సాధించలేకపోయింది. భవిష్యత్తులో బాలకృష్ణపై ఎదురుదెబ్బ పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

click me!