
భవిష్యత్ ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పేట్లు లేదు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ట్వీట్లు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ప్రత్యేకహోదా అంశాన్ని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంపార్టీలు పక్కనబెట్టేసాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశం ముగిసిన అధ్యాయంగా ప్రకటించాయి కూడా.
అధికార పార్టీలు ముగించేసినా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇపుడు అదే అంశంపై కేంద్రంలోని భాజపా నిర్ణయానికి వ్యతిరేకంగా తాజాగా పవన్ కూడా సమరభేరి మోగించటం గమనార్హం. ప్రత్యేకహోదాపై పోరాటం చేయాలని ప్రజలకు పిలుపివ్వటమంటే అధికార పార్టీలకు దూరంగ జరగటమే కదా.
అంటే, అధికారంలో ఉన్న మిత్రపక్షాలు ఓవైపు, ప్రతిపక్ష వైసీపీ ఇంకోవైపు ఉండగా, తాజాగా జనసేన మరోవైపు చేరింది. దాంతో రాష్ట్రంలో జరిగే ఎటువంటి ఎన్నికల్లోనైనా త్రిముఖ పోటీ తప్పేట్లు లేదు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పటం ద్వారా భాజపా విషయంలో పవన్ తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది.
ఒకరకంగా భాజపాకు రాష్ట్రంలో సొంతబలమంటూ లేదు. ఏదైనా గాలి వీచినపుడు మాత్రమే ఏదో నాలుగు సీట్లు గెలుస్తుంది. అటువంటిది మొన్నటి ఎన్నికల్లో కూడా మోడి గాలికి తోడు పవన్, టిడిపిలు మిత్రపక్షాలుగా ఉండటంతో భాజపా అభ్యర్ధులు కొన్ని చోట్ల విజయం సాధించారు.
అధికారంలోకి రాగానే భాజపా ఎన్నికల హమీలను పూర్తిగా మరచిపోయింది. మరచిపోయిన హామీల్లో ప్రత్యేకహోదా, విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్ చాలా కీలకం. కేంద్రంలోని భాజపా మీదే ఆధారపడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పై అంశాలపై గట్టిగా పట్టుపట్టే అవకాశాలు లేవు. దాంతో భాజపా పై రెండు హామీలను పూర్తిగా తుంగలో తొక్కేసింది.
అయితే, గడచిన మూడు మాసాల నుండి రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్న పవన్ కూడా తిరుపతి, కాకినాడ, అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించారు. అదే వరసలో ఆదివారం చేసిన ట్వీట్ లో ప్రత్యేకహోదా ఇవ్వకపోతే భాజపాను వదిలేది లేదంటూ పవన్ గట్టిగా చెప్పారు. దాంతో భాజపాతో భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలు లేనట్లేనని పవన్ చెప్పకనే చెప్పినట్లైంది.