నిమ్మగడ్డపై జగన్ ప్రభుత్వం కౌంటర్ అటాక్: సభా హక్కుల నోటీసులిచ్చిన మంత్రులు

By telugu teamFirst Published Jan 30, 2021, 1:16 PM IST
Highlights

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఊహించినట్లే సీఎం జగన్ ప్రభుత్వం కౌంటర్ అటాక్ ప్రారంభించింది. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగినట్లే కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మంత్రులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. స్పీకర్ కార్యాలయంలో వారు ఆ నోటీసులు ఇచ్చారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ లక్ష్మణ రేఖ దాటారని, పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

రాజకీయ నేతలపై మాట్లాడే హక్కు ఎస్ఈసీకి లేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ అన్నారు.తమ హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఎంపీ విజయసాయి రెడ్డి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. రమేష్ కుమార్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ప్రభుత్వం పెద్దలు ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా జరుగుతున్న ఉత్తరప్రత్యుత్తరాల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ మీద ప్రభుత్వం గుర్రుగా ఉంది. గవర్నర్ ను కలవడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఎస్ఈసీగా రమేష్ కుమార్ పరిధిని నిర్ధారించాలని కోరుతూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని పదవి నుంచి తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కోరారు. అంతేకాకుండా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలపై కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో తమ హక్కులకు భంగం కలిగించే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారు. 

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికను విడుదల చేయడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెదవి విప్పకపోవడాన్ని కూడా జగన్ ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. పార్టీరహితంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ మానిఫెస్టో విడుదల చేసిందని, దానిపై మాత్రం నిమ్మగడ్డ చర్యలు తీసుకోవడం లేదని మంత్రులు భావిస్తున్నారు. ఈ స్థితిలో నిమ్మగడ్డ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. 

click me!