డేరాబాబా కంటే డేంజర్: చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

By narsimha lode  |  First Published Sep 20, 2022, 1:40 PM IST

ప్రజల డేటా చోరీ చేసిన విషయమై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఏపీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తమకు ఓటు వేయని వారి ఓట్లను తొలగించేందుకు చంద్రబాబు  సర్కార్ సేవా మిత్ర యాప్ ను ఉపయోగించుకుందన్నారు. 


అమరావతి: డేటా దొంగ చంద్రబాబునాయుడు డేరా బాబా కంటే డేంజరని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా విమర్శించారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి  మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీనే చెప్పారని మంత్రి రోజా గుర్తు చేశారు. సేవా మిత్ర యాప్ ద్వారా చంద్రబాబు సర్కార్ ప్రజల డేటా చోరీ చేశారన్నారు. ఈ డేటా చోరీపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు.

Latest Videos

undefined

 డేటా చోరీ చేసిన తర్వాత తమకు ఓట్లు వేయరనే ఉద్దేశ్యంతో 30 లక్షల ఓట్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కార్  ఆనాడు ప్రయత్నించిందని రోజా ఆరోపించారు. ప్రజలు వైసీపీకి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని పసిగట్టిన చంద్రబాబునాయుడు వైసీపీకి పడే ఓట్లను తొలగించే కుట్ర చేఁశారని మంత్రి రోజా చెప్పారు.  

అంతేకాదు విపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లను కూడా చంద్రబాబు సర్కార్ ట్యాపింగ్ చేసిందని ఆమె ఆరోపించారు. గతంలో వైసీపీలో గెలిచిన  23 మంది ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేసి తమ పార్టీలో చేర్పించుకున్నారని మంత్రి రోజా ఆరోపించారు.ఇలాంటి వారిని వదిలిపెట్టవద్దని రోజా కోరారు. 

  ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ఆమె చెప్పారు. అమ్మఒడి కుదించామని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా చెప్పారు. అమ్మఒడి ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ రోజైనా వచ్చిందా అని మంత్రి ప్రశ్నించారు. 44 లక్షల మంది తల్లులకు అమ్మఒడిని అందిస్తున్నామని మంత్రి రోజా చెప్పారు. 98 శాతం హమీలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని రోజా  తెలిపారు.చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏ ఒక్క మంచి పథకం తీసుకువచ్చారా అని ఆమె అడిగారు. ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు సర్కార్ చంద్రన్న కానుక పేరుతో దోచుకుందని ఆమె విమర్శించారు. అన్న క్యాంటిన్ పేరుతో టీడీపీ నేతలు హంగామా చేస్తున్నారన్నారు.
 

click me!