అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుకు రైతులు గుర్తుకు రాలేదని ఏపీ సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. రైతుల ముసుగులో నాటకాలాడుతున్నారని ఆయన బాబుపై మండిపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను పట్టించుకోని చంద్రబాబునాయుడు ఇవాళ రైతుల ముసుగులో నాటకాలాడుతున్నారని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు.బాబు హయాంలో ఐదేళ్లలో చెల్లించింది తమ ప్రభుత్వం ఏడాదిలోనే చెల్లించిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
కేంద్రం రాష్ట్ర సివిల్ సప్లైకు రూ.5,056 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతిపైసా కూడా ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడూ కూడ సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు. సామాజిక న్యాయం అంటే చంద్రబాబుకు ఆయన కులానికే న్యాయం చేయడమని మంత్రి ఎద్దేవా చేశారు.ఆర్థిక, సామాజికంగా వెనుకబడినవారికి ఒకేసారి నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు.