పాదయాత్ర కాదు...జగన్ ది ముద్దుల యాత్ర

First Published Nov 9, 2017, 2:22 PM IST
Highlights
  • వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని కేవలం ముద్దుల యాత్రగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ ఎద్దేవా చేసారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని కేవలం ముద్దుల యాత్రగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ ఎద్దేవా చేసారు. మంత్రి గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జగన్ పాదయాత్ర పై అపోహలు ప్రచారం లో ఉన్నాయన్నారు. అసలు జగన్ పాదయాత్ర ఉద్దేశ్యం ఏంటి అని తాను ఎంతమందిని అడిగినా ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదని చెప్పారు. జగన్ మొదలు పెట్టింది ప్రజా సంకల్ప యాత్ర కాదని సీఎం సంకల్ప యాత్రగా మంత్రి వర్ణించారు.

ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తెలిసి కూడా దింపుడు కళ్లెం ఆశ లాగ జగన్  సంకల్ప యాత్ర చేస్తున్నాడంటూ ఎద్దేవా చేసారు. అసెంబ్లీ సమావేశాలను బాయికాట్ చేసి జగన్ చారిత్రిక తప్పిదం చేస్తున్నాడని అభిప్రాయపడ్డారు. సింగపూర్ లో ఉన్నట్లే ఇక్కడా సభలో ప్రతిపక్షం లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఏదేమైనా కేకలు, అరుపులు లేని అసెంబ్లీ సమావేశాలను రాష్ట్రం చూడబోతుందన్నారు. తన బిడ్డను ఆశీర్వదించమని స్వయంగా విజయమ్మ ప్రజలను అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

బైబిల్ పట్టుకున్నవారు ఇతరులను ఆశీర్వదిస్తారే కానీ, ఇతరులను ఆశీర్వదించమని అడగరని చెప్పారు. తన వద్దకు వచ్చే వాళ్ళని దగ్గరకు తీసుకుని జగన్ పెడుతున్న ముద్దులకు భయపడి 40 ఏళ్ల లోపు వాళ్లు జగన్ దగ్గరకు వెళ్లడం లేదన్నారు. ఈ యాత్ర ముగిసే సరికి జగన్ వెంట రోజా లాంటి ఒకరిద్దరు తప్ప... మిగిలిన నేతలెవ్వరూ  మిగలరని జవహర్ స్పష్టం చేసారు.

click me!