రక్తి కడుతున్న ‘ఫిరాయింపుల నాటకం’

First Published Nov 9, 2017, 12:42 PM IST
Highlights
  • మొత్తానికి అధికార పార్టీ నేతలంతా కూడబలుక్కుని ఫిరాయింపుల రాజకీయాన్ని బాగా రక్తి కట్టిస్తున్నారు.

మొత్తానికి అధికార పార్టీ నేతలంతా కూడబలుక్కుని ఫిరాయింపుల రాజకీయాన్ని బాగా రక్తి కట్టిస్తున్నారు. తమపార్టీ తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపైన చర్యలు తీసుకోండి మహాప్రభో అని వైసీపీ నేతలు మొత్తుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నదే. గడచిన రెండున్నరేళ్ళుగా నిసిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబునాయుడు స్వయంగా. దాంతో విసిగిపోయిన వైసీపీ అధ్యక్షుడు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు. దాంతో అధికారపార్టీలో కాకపుట్టింది.

ప్రస్తుత విషయానికి వస్తే, ఫిరాయింపుల మీద చర్యలు తీసుకోలేకపోవటానికి కారణం వైసీపీనే అంటూ స్పీకర్ కోడెలశివప్రసాదరావు ఎదురుదాడి మొదలుపెట్టడం విచిత్రంగా ఉంది. ఫిరాయింపులపై తాను చర్యలు తీసుకునే విషయంలో తన నిర్ణయం కోసం ఎదురు  చూడకుండానే వైసీపీ కోర్టుకు వెళ్ళిపోయిందట. అందుకే తాను ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారట. ఫిరాయింపులపై స్పీకర్ అనర్హత వేటు వేస్తే  కోర్టేమన్నా తప్పుపడుతుందా?

అదే సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే వైసీపీ కూడా వెంటనే కేసును ఉఫసంహరించుకుంటుంది కదా? అంటే కోర్టులో కేసుంది కాబట్టే తానేమీ చర్యలు తీసుకోలేకపోతున్నాను అన్నది కేవలం సాకు మాత్రమే అని తేలిపోతోంది. అప్పటికేదో ఫిరాయింపలపై వైసీపీ కోర్టుకెళ్ళకుండా ఉంటే ఈ పాటికే తాను చర్యలు తీసుకునే వాణ్ణి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే, ఫిరాయింపుల సమస్య ఏపిలోనే కాదట మరో 15 రాష్ట్రాల్లోనూ ఉందని కోడెల చల్లగా చెబుతున్నారు.

ఇక, చంద్రబాబునాయుడు చూస్తే ‘వైసీపీ కోర్టుకెళ్ళింది కదా? అక్కడ ఏం తేలుతుందో చూద్దాం’ అంటున్నారు. పైగా ‘రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు కదా’...‘ధర్మాసనం ఏర్పాటై ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం’ అని తప్పించుకుంటున్నారు. పైగా ఇంకా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇక, ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పే కథ వేరేగా ఉంది. తామెప్పుడో రాజీనామా చేసేసినట్లు చెబుతున్నారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్, చంద్రబాబేనట.

పైగా తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించి వెంటనే ఉపఎన్నికలు జరిపించాలని కూడా రిక్వెస్ట్ చేసుకోవటం విచిత్రంగా ఉంది. అప్పటికేదో ఉపఎన్నికలు నిర్వహించటమన్నది స్పీకర్ చేతిలో ఉన్నట్లు? మొత్తానికి వీళ్ళు చెప్పేది చూస్తుంటే ఫిరాయింపులపై చర్యలు తీసుకునేది లేదని పరోక్షంగా టిడిపి తేల్చి చెబుతున్నట్లే ఉంది.

click me!